Systematic Withdrawal Plan in Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి మనలో చాలా మందికి తెలుసు. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్‌-డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌ చేసే పద్ధతి మ్యూచువల్‌ ఫండ్‌. దీనివల్ల, దీర్ఘకాలంలో మంచి రాబడి రావడంతో పాటు, పెట్టుబడి రిస్క్‌ దాదాపుగా ఉండదు. 


మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ పాపులర్‌ పద్ధతి 'సిప్‌ లేదా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌' (Systematic Investment Plan - SIP). దీంతోపాటు, సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (Systematic Transfer Plan- STP), సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌ (Systematic Withdrawal Plan - SWP) కూడా ఉన్నాయి. 


సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌కు సరిగ్గా రివర్స్‌లో ఉంటుంది సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌.


 సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌ అంటే ఏంటి? (What is Systematic Withdrawal Plan)
SIP పద్ధతిలో, ఒక ఇన్వెస్టర్‌ ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ వెళతాడు. అలా దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టిస్తాడు. SWP పద్ధతిలో, ముందుగానే పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసి ప్రతి నెలా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేస్తాడు. లేదా, ఒక క్రమపద్ధతిలో డబ్బు జమ చేసుకుంటూ వెళ్లి, ఒక పెద్ద అమౌంట్‌ కాగానే నెలనెలా కొంత మొత్తం చొప్పున వెనక్కు తీసుకుంటాడు. అంటే, SWPతో ప్రతి నెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్‌ తీసుకున్న వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. SWP ద్వారా, తమ అవసరాలకు సరిపడేంత డబ్బును స్థిరంగా వచ్చేలా చూసుకోవచ్చు.


ఇన్వెస్టర్‌ అవసరానికి అనుగుణంగా మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చొప్పున కూడా రాబడిని వెనక్కు తీసుకోవచ్చు.


ఎస్‌డబ్ల్యూపీలో... నెలకు/మూడు నెలలకు/ఆరు నెలలకు/ఏడాదికి ఎంత మొత్తం కావాలో ముందే నిర్ణయించుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్‌ కంపెనీ, మీ అకౌంట్‌లో ఉన్న యూనిట్లను అమ్మి ఆ డబ్బును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఏ తేదీన మీకు డబ్బు కావాలో కూడా నిర్ణయించుకోవచ్చు. సరిగ్గా ఆ తేదీన మీ బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.


SWP ఎలా పని చేస్తుంది? ‍‌(How does SWP work?)
మ్యూచువల్‌ ఫండ్‌ మీకు పంపే డబ్బులో కొంత భాగం మీ పెట్టుబడి, మరికొంత భాగం ఆ యూనిట్ల మీద వచ్చిన లాభం కలిసి ఉంటాయి. ఈ లాభం మీద మాత్రమే పన్ను (Tax on Mutual Fund) చెల్లిస్తే సరిపోతుంది. మీరు హోల్డ్‌ చేసిన కాలాన్ని బట్టి... దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదా స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (Long-term capital gains tax or Short-term capital gains tax) వర్తిస్తుంది. 


నెలకు ఫిక్స్‌డ్‌గా రూ.10 వేలు కావాలని మీరు నిర్ణయించుకుంటే, మీరు ఎంచుకున్న తేదీ నాటికి కచ్చితంగా అంతే డబ్బు వచ్చేలా ఫండ్‌ కంపెనీ మీ యూనిట్లను విక్రయిస్తుంది. ఇక్కడ, మీకు రూ.10 వేలు ఇవ్వడం కోసం ఒక్కోసారి ఎక్కువ యూనిట్లు, ఒక్కోసారి తక్కువ యూనిట్లను అమ్మాల్సి ఉంటుంది. ఆయా షేర్లకు అప్పటికి ఉన్న ధరను బట్టి, రూ.10 వేలు వెనక్కు తీసుకోవడానికి ఎన్ని యూనిట్లు అమ్మాలో డిసైడ్‌ అవుతుంది. అలా కాకుండా, నిర్ణీత కాలంలో ఎన్ని యూనిట్లు అమ్మాలో మీరు నిర్ణయిస్తే, ఫండ్‌ కంపెనీ కచ్చితంగా అన్ని యూనిట్లు మాత్రమే అమ్ముతుంది. మార్కెట్‌ రేటును బట్టి, మీకు వచ్చే రాబడిలో హెచ్చుతగ్గులు ఉంటాయి.


పెట్టుబడి నుంచి నెలనెలా కొంత వెనక్కు తీసుకున్నా.. మిగిలిన డబ్బు పెట్టుబడి రూపంలోనే కొనసాగుతుంటుంది. మార్కెట్‌లో అప్‌ & డౌన్స్‌ను బట్టి ఆ పెట్టుబడి పెరుగుతూ/తగ్గుతూ ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ అదరగొట్టిన చిన్న కంపెనీలు - వారంలో రెండంకెల లాభం తెచ్చిన 46 స్మాల్‌ క్యాప్స్‌