Mutual Funds SIPs: మ్యూచువల్ ఫండ్స్‌ మీద భారత ప్రజలు బాగా నమ్మకం కనబరుస్తున్నారు, భారీగా డబ్బు పెట్టుబడులు పెడుతున్నారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్ రూ. 2.2 లక్షల కోట్లు పెరిగిందని, 2022లో మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం మొత్తం రూ. 39.88 లక్షల కోట్లకు చేరిందని లెక్కలు వేశారు. 


ముఖ్యంగా, క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (Systematic Investment Plan - SIP) మార్గం ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలోకి భారీ ఎత్తున ఇన్వెస్టర్ల నగదు వస్తోంది. సిప్‌ ట్రెండ్‌లో కారణంగా, MF ఇండస్ట్రీ (Mutual Fund Industry) నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో ‍(Assets Under Management  - AUM) మంచి పెరుగుదల కనిపిస్తోంది.


అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) విడుదల చేసిన డేటా ప్రకారం... 2022లో, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ 5.7 శాతం లేదా రూ. 2.2 లక్షల కోట్ల వృద్ధితో రూ. 39.88 లక్షల కోట్లకు చేరుకోనుంది. అయితే... 2021లో AUMలో నమోదైన 22 శాతం పెరుగుదల కంటే ఇది చాలా తక్కువ. 2021లో, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు పెరిగి 37.72 లక్షల కోట్లకు చేరుకుంది.


మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రతి నెలా 12,500 కోట్లు
స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, వడ్డీ రేట్లలో పెరుగుదల కారణంగా 2022లో ఈక్విటీల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదని ఫైర్స్ (FYERS) రీసెర్చ్ హెడ్ కావలి గోపాల్‌రెడ్డి చెప్పారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొత్తగా ప్రవేశించడానికి ఇదే కారణం. 2022 క్యాలెండర్ సంవత్సరంలో, సగటున నెలవారీ SIP పెట్టుబడి రూ. 12,500 కోట్లుగా లెక్క తేలింది.


సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గం ద్వారా వచ్చిన స్థూల పెట్టుబడులు, 2022లో దాదాపు ప్రతి నెలా కొత్త ఆల్ టైమ్ హైస్‌ను తాకాయి, రికార్డ్‌ సృష్టించాయి.


నవంబర్, డిసెంబర్‌లో రూ. 13,000 కోట్లకు పైగా వ్యాపారం
2022లో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు పెరగడానికి ప్రధానం నవంబర్, డిసెంబర్‌ నెలలు. ఈ రెండు నెలల్లో రూ. 13,000 కోట్ల పైగా SIP పెట్టుబడులు నమోదయ్యాయి. నవంబర్‌లో రూ.13,300 కోట్లుగా ఉన్న SIP ఇన్‌ ఫ్లో, డిసెంబర్‌లో  రూ.13,570 కోట్లకు పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన అవగాహనను రిటైల్ ఇన్వెస్టర్లలో పెంచడంలో AMFI ముఖ్య పాత్ర పోషించింది.


ఈక్విటీ పథకాల్లో 1.61 లక్షల కోట్ల పెట్టుబడి
2021 క్యాలెండర్ సంవత్సరంలో, ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాల్లో రూ. 96,700 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2022లో రూ.1.61 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 2022 సంవత్సరం కంటే 2023 మీద మరింత ఎక్కువ అంచనాలు ఉన్నాయి. నెలవారీ సగటు SIP దాదాపు రూ. 14,000 కోట్లను తాకుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.