Mutual Fund Investors: డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆస్వాదిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను ‍‌(long-term capital gain tax లేదా LTCG) ప్రయోజనాన్ని రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం, ఫైనాన్స్ బిల్లుకు సవరణ చేసే ప్రయత్నాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


డెట్ మ్యూచువల్ ఫండ్‌లను 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే, దీర్ఘకాలిక పెట్టుబడులుగా వాటిని ఇప్పుడు పరిగణిస్తున్నారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ (indexation benefit) ప్రయోజనంతో కలిపి 20% పన్ను లేదా ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 10% చొప్పున పన్ను విధిస్తున్నారు. 3 సంవత్సరాల కంటే తక్కువ హోల్డింగ్ వ్యవధి ఉన్నవారికి వారి స్లాబ్ రేట్‌ ప్రకారం పన్ను విధించబడుతుంది.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తరహా పన్ను
ప్రతిపాదిత సవరణల తర్వాత, ఈక్విటీ షేర్లలో 35% కంటే ఎక్కువ పెట్టుబడి ఉండని డెట్ ఫండ్‌పై ఆదాయపు పన్ను స్లాబ్ రేట్‌ (income tax slab level) ప్రకారం పన్ను కట్టాల్సి వస్తుంది, దానిని స్వల్పకాలిక మూలధన లాభంగా (short-term capital gain) పరిగణనిస్తారు. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇదే విధంగా పన్ను విధిస్తున్నారు.


ఇవాళ (శుక్రవారం, మార్చి 24, 2023), ప్రతిపాదిత సవరణలతో పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లును ప్రవేశపెడతారు. బంగారం, ఇంటర్నేషనల్‌ ఈక్విటీ, దేశీయ ఈక్విటీ ఫండ్స్ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (FoFs) కూడా ప్రతిపాదిత మార్పులు వర్తిస్తాయి. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే, ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. 


ప్రతిపాదిత మార్పుల కంటే ముందే ప్రయోజనాన్ని పొందాలనుకునే పెట్టుబడిదార్లు, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా (మార్చి 31 లోగా) పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 1, 2023 నుంచి పెట్టే పెట్టుబడులకు సవరణలు వర్తిస్తాయి.


ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. HDFC AMC స్టాక్ 4% పైగా క్షీణించింది, నిప్పాన్ AMC 1.75% పడిపోయింది. UTI AMC 2% తగ్గింది.


మార్పులను వ్యతిరేకించిన ఫండ్‌ కంపెనీలు
డెట్ ఫండ్స్‌పై ఇండెక్సేషన్ స్టేటస్‌తో కూడిన ఎల్‌టీసీజీ బెనిఫిట్‌ను తొలగించే ప్రతిపాదిత మార్పుపై కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించాలని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ MD & CEO రాధికా గుప్తా సూచించారు.


ఈ చర్య భారతదేశంలో కొత్త డెట్ మార్కెట్‌కు పెద్ద దెబ్బగా ఫింట్‌రెక్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అమిత్ కుమార్ గుప్తా అభివర్ణించారు. "పన్ను మధ్యవర్తిత్వం ఇప్పుడు పోయింది. డెట్‌ ఫండ్స్‌ను FDలు, NCDలతో సమానంగా చూస్తున్నారు" అని అన్నారు. అయితే ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరగవచ్చని చెప్పారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.