CPSE Profit: ఒకటి, రెండు కంపెనీలు తప్ప; స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన చాలా ప్రభుత్వ రంగ సంస్థల మీద ఇన్వెస్టర్లకు చిన్న చూపు ఉంది. అదే రంగంలో ఉన్న ప్రైవేటు కంపెనీలకు ఉన్నంత ఆదరణ, వీటి మీద లేదు. ప్రభుత్వ రంగ కంపెనీల పనితీరు అలా ఉంటే ఇన్వెస్టర్లు మాత్రం ఏం చేస్తారు?


19 సంస్థలు
ఇకపోతే, అపప్రధను చెరిపేస్తూ... 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 19 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSEలు) లాభాల్లోకి తిరిగి వచ్చాయి. అంతకుముందు ఈ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. తిరిగి గాడిలో పడిన CPSEల్లో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), చెన్నై పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (CPCL), వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) కూడా ఉన్నాయి.


రిఫైనరీ, ఎరువులు, ఆర్థిక సేవలు, పారిశ్రామిక, వినియోగ వస్తువులు వంటి ఇండస్ట్రీల్లో పని చేస్తున్న ఈ 19 CPSEల్లో, ఎనిమిది FY21కి ముందు వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ నష్టాలను నివేదించాయి. 


ఇప్పుడు గాడిలో పడ్డ చాలా కంపెనీలు పారిశ్రామిక, వినియోగ వస్తువుల రంగాలకు చెందినవి. వాటిలో.. ఆండ్రూ యూల్ & కంపెనీ (Andrew Yule & Company), హిందుస్థాన్ సాల్ట్స్ ‍‌(Hindustan Salts), సంభార్ సాల్ట్స్ (Sambhar Salts), సిమెంట్ కార్ప్ ఆఫ్ ఇండియా ‍‌(Cement Corp of India) ఉన్నాయి. ఇవన్నీ ఖర్చులు తగ్గించుకున్నాయి & టర్నోవర్‌, ఆదాయంలో పెరుగుదలను నివేదిస్తున్నాయి.


తగ్గిన ఖర్చులు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీలు ఆదాయాలు తగ్గినా లాభాలు మూటగట్టుకోవడానికి కారణం, వాటి ఖర్చులు తగ్గించుకోవడమే. CPCL, WCL, NFL తలో రూ.200 కోట్లకు పైగా లాభాలను నమోదు చేశాయి. CPCL తన మొత్తం ఖర్చులను 21 శాతం, NFL 10.45 శాతం, WCL 5.84 శాతం తగ్గించుకున్నాయి.


ప్రైవేటీకరణ అంశమే స్ట్రాంగ్‌ డోస్‌
CPSEలు తిరిగి లాభాల్లోకి రావడానికి 'ప్రైవేటీకరణ అంశం' స్ట్రాంగ్‌ డోస్‌లా పని చేసింది. నికర విలువ, లాభం, ఈక్విటీపై రాబడి (RoE) , ఆస్తులపై రాబడి (RoA), అమ్మకాల పరంగా చూస్తే, ప్రైవేటీకరించిన CPSEలు తమ పోటీ కంపెనీల కంటే మెరుగ్గా పని చేస్తున్నాయి. వీటి RoA, నికర లాభ మార్జిన్ మైనస్‌ నుంచి ప్లస్‌లోకి మారాయి. ప్రైవేటీకరణ తర్వాత, గతంలో ఉన్న వనరుల నుంచే అవి ఎక్కువ సంపదను పొందగలిగాయి.


రెండు PSU బ్యాంకులు & ఒక బీమా కంపెనీ సహా కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలు కూడగట్టే లక్ష్యాన్ని FY22లో కేంద్రం ప్రకటించింది. దీనిలో భాగంగా, 2021 మే నెలలో, ఐడీబీఐ బ్యాంక్‌లో (IDBI Bnak) వ్యూహాత్మక ఉపసంహరణ (స్ట్రాటెజిక్‌ డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌) & నిర్వహణ నియంత్రణ బదిలీకి (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌) కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.


దీని కంటే ముందు, 2020 డిసెంబర్ 19న, అర్హత గత సంస్థాగత ప్లేస్‌మెంట్ కింద అదనపు ఈక్విటీ షేర్లను బ్యాంక్‌ జారీ చేయడంతో, దీనిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వాటా 49.24 శాతానికి తగ్గింది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్ ఒక అనుబంధ కంపెనీగా మారింది.


ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉండగా, ఎల్‌ఐసీకి 49.24 శాతం స్టేక్‌ ఉంది. 2019లో, ఈ జీవిత బీమా సంస్థ రూ.21,624 కోట్లను బ్యాంకులో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం, మేనేజ్‌మెంట్ కంట్రోల్‌తో ఐడీబీఐ బ్యాంక్ ప్రమోటర్‌గా LIC ఉంది. ప్రభుత్వానికి సహ ప్రమోటర్‌ పాత్ర.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.