Coffee Day Enterprises: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ (CDEL), తన ఇన్వెస్టర్ల నెత్తిన పాలు పోసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ అప్పులు రూ.1,810 కోట్లకు, గణనీయంగా తగ్గాయని తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.


2019 మార్చి 31 (FY19‌) నాటికి ఈ కంపెనీ మీద అప్పులు అతి భారీగా, రూ.7,214 కోట్లుగా ఉన్నాయి. గతేడాది మార్చి 31 నాటికి (FY21‌) రూ.1,898 కోట్లకు తగ్గించిన సంస్థ, గత ఆర్థిక సంవత్సరంలో (FY22) మరో రూ.88 కోట్ల బకాయిలు తీర్చింది. దీంతో, ఈ ఏడాది మార్చి 31 నాటికి (FY22) రూ.1,810 కోట్ల అప్పులు మాత్రం మిగిలాయి.


అప్పులు భారీగా తీర్చేస్తుంది కదానీ ఈ కంపెనీ మీద ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ఇప్పటికీ కొన్ని రుణాలు తీర్చలేక డిఫాల్ట్‌ (ఎగవేత) అయింది. 


సెబీకి CDEL ఇచ్చిన సమాచారం (డిస్‌క్లోజర్‌) ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌ 6 నాటికి, కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.230.66 కోట్లను (అసలు, వడ్డీ కలిపి) గడవులోగా చెల్లించలేకపోయింది. అంతేకాదు, రూ.249.02 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కూడా చెల్లించలేకపోయింది.


అయితే, కంపెనీకి రావలసిన మొత్తాలు కూడా ఉన్నాయి. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్ (MACEL) నుంచి కాఫీ డేకి చెందిన వివిధ అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్‌కు రావలసిన రూ.3,430.67 కోట్ల మొత్తాన్ని ఇంకా రికవరీ చేయాల్సి ఉందని డిస్‌క్లోజర్‌లో CDEL తెలిపింది. ఆ బకాయి మొత్తాన్ని రికవరీ చేయడానికి MACELపై దావా వేయాలని తన అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్‌కు కాఫీ డే సూచించింది.


కాఫీ డే వ్యవస్థాపక ఛైర్మన్ వీజీ సిద్ధార్థ 2019 జులైలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత CDEL తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కంపెనీకి ఉన్న వేల కోట్ల అప్పుల లెక్కలు బయటకు వచ్చాయి. ఆయన చనిపోయే నాటికే అప్పులు చెల్లించలేని పరిస్థితిలోకి కంపెనీ దిగజారింది. సిద్ధార్థ మరణం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను పెద్ద మొత్తాల్లో అమ్మేశారు. దీంతో షేరు ధర కుప్పకూలింది. సిద్ధార్థ మరణానికి ముందు రూ.300 పైన ఉన్న షేరు ధర, ఆ తర్వాత దాదాపు రూ.10 వరకు పడిపోయింది.


నిండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ సమయంలో, సిద్ధార్థ భార్య మాళవికా హెగ్డే కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. పరిస్థితులను ఆకళింపు చేసుకుని క్రమంగా చక్కదిద్దారు.


2020 మార్చిలో, CDEL తన టెక్నాలజీ బిజినెస్ పార్కును బ్లాక్‌స్టోన్ గ్రూప్‌నకు అమ్మేసింది. తద్వారా 13 మంది రుణదాతలకు రూ.1,644 కోట్లను తిరిగి చెల్లిస్తున్నట్లు ప్రకటించింది.


ప్రస్తుతం, సీఈవో, పూర్తి స్థాయి డైరెక్టర్, బోర్డ్ సభ్యుల సహాయంతో ఒక ప్రొఫెషనల్ టీమ్‌ కంపెనీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.


CDEL అనుబంధ సంస్థ అయిన కాఫీ డే గ్లోబల్‌ లిమిటెడ్‌ (Coffee Day Global Ltd), సుప్రసిద్ధ కాఫీ చైన్ 'కెఫే కాఫీ డే'ని (CCD) నిర్వహిస్తోంది. దీనికి 158 నగరాల్లో 495 కేఫ్‌లు, 285 సీసీడీ వాల్యూ ఎక్స్‌ప్రెస్ కియోస్క్‌లు ఉన్నాయి.


ఈ బ్రాండ్ కింద కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లు, హోటళ్లలో కాఫీని అందించే 38,810 వెండింగ్ మెషీన్లు ఉన్నాయి.


కొవిడ్‌కు ముందు, అంటే FY20లో, మొత్తం కేఫ్‌ల సంఖ్య 1,192గా ఉంది.


ఇవాళ రూ.50.50 దగ్గర షేరు ధర ఓపెన్‌ అయింది. గత నెల రోజుల్లో ఈ షేర ధర దాదాపు 14 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 11 శాతం పైగా నష్టపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.