Muttiah Muralitharan For Campa Cola: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముక్‌ష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో, శీతల పానీయాల మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకో నుంచి ఆధిపత్య కుర్చీ లాక్కునేందుకు తన బలం పెంచుకుంటోంది. ఇందులో భాగంగా.. జగమెరిగిన క్రికెటర్‌, లెజండరీ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీకి సాయం చేయబోతున్నారు.


మురళీధరన్ చేసే సాయం ఏంటి?
శ్రీలంక వెటరన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌కు చెందిన కంపెనీ 'సిలోన్ బెవరేజ్ ఇంటర్నేషనల్‌'తో రిలయన్స్ ఇండస్ట్రీస్ FMCG విభాగమైన 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌' (RCPL) ఒక ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ కింద, మురళీధరన్ కంపెనీ కాంపా కోలా క్యాన్స్‌ ప్యాకింగ్ వర్క్ చేస్తుంది. ఇందుకోసం సిలోన్ బెవరేజెస్ భారతదేశంలో ఒక ప్యాకేజింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్లాంట్ పూర్తయ్యే వరకు, క్యాన్డ్ కాంపా కోలాను శ్రీలంకలోని సిలోన్ బెవరేజెస్‌ ఫ్యాక్టరీ నుంచి దిగుమతి చేస్తారు.


అంతేకాదు, డీల్‌లో భాగంగా, ముత్తయ్య మురళీధరన్‌ కంపెనీ ఉత్పత్తి చేసే ఎనర్జీ డ్రింక్ 'స్పిన్నర్‌' ‍‌(spinner energy drink) భారతదేశంలో అందుబాటులో ఉంటుందని సమాచారం. ఒప్పందం ప్రకారం, కాంపా కోలాతో పాటు స్పిన్నర్ బ్రాండ్‌ను కూడా రిలయన్స్‌ తన స్టోర్లలో అమ్మకానికి పెడుతుంది.


దక్షిణాది కంపెనీలతో బాట్లింగ్‌ ఒప్పందాలు
శీతల పానీయాల మార్కెట్‌లో గరిష్ట వాటాను చేజిక్కించుకోవడానికి, RCPL, దక్షిణ భారతదేశ కంపెనీలతో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంది. 'ట్రూ', 'యూ టూ' బ్రాండ్‌ల కింద మిల్క్ షేక్స్, ఫ్రూట్ డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తున్న తమిళనాడుకు చెందిన ఏషియన్ బెవరేజ్‌తో ‍‌(Asian Beverage), చెన్నైకి చెందిన బోవోంటో ‍‌(Bovonto) శీతల పానీయాల తయారీ సంస్థ కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌తో (Kali Aerated Water Works) రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, కాంపా కోలాను ఆయా కంపెనీల ప్లాంట్లలో ఉత్పత్తి చేసి, బాట్లింగ్‌ చేసి, మార్కెట్‌లోకి తీసుకొస్తారు. జల్లాన్ ఫుడ్ ప్రొడక్ట్స్‌తో (Jallan Food Products) ఒప్పందం చేసుకున్న లయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్... ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని ప్లాంట్లలో కాంపా కోలా బాట్లింగ్‌ చేస్తోంది.


దేశంలోని అన్ని కిరాణా, పాన్-సిగరెట్, శీతల పానీయాల దుకాణాల్లో కాంపా కోలా ఉండాలన్నది RCPL ప్లాన్‌. ఇందుకోసం.. వీటిని జియోమార్ట్‌ B2B, మెట్రో క్యాష్ & క్యారీ నెట్‌వర్క్‌లో అమ్మడంతో పాటు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ B2B ప్లాట్‌ఫామ్‌తోనూ జత కట్టింది. 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో కోలా, లెమన్‌, ఆరెంజ్‌ వేరియంట్‌లతో కాంపా కోలాను రిలయన్స్‌ అమ్ముతోంది. వచ్చే 2-3 మూడు వారాల్లోనే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని సమాచారం.


రిలయన్స్, గత ఆగస్టులో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ (Pure Drinks Group) నుంచి కాంపా బ్రాండ్‌ను సుమారు ₹22 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.