Multibagger stock: సోమవారం, 2022-23 ‍‌(FY23) సెప్టెంబర్‌ త్రైమాసికం ఆర్థిక పనితీరును ప్రకటించిన గ్లోస్టర్ లిమిటెడ్‌ (Gloster Ltd), ఒక్కో షేరుకు రూ. 50 లేదా 500 శాతం మధ్యంతర డివిడెండ్‌ (interim dividend) కూడా ప్రకటించింది. డివిడెండ్‌ అందుకునేందుకు, నవంబర్ 16ను రికార్డ్ తేదీగా ప్రకటించింది. నవంబర్ 30న లేదా అంతకంటే ముందే షేర్‌హోల్డర్లకు ఈ కంపెనీ డివిడెండ్ చెల్లిస్తుంది. 


2022-2023 ఆర్థిక సంవత్సరానికి రూ.10/- ముఖ విలువ గల 54,71,630 ఈక్విటీ షేర్లకు, ఒక్కో షేరుకు 500% చొప్పున రూ.50/- మధ్యంతర డివిడెండ్‌ చెల్లిస్తాం. ఇందుకోసం 16 నవంబర్ 2022ను (బుధవారం) రికార్డు తేదీగా నిర్ణయించాం. అని ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.


రికార్డ్‌ డేట్‌ అంటే.. 
ఒక కంపెనీ రికార్డ్స్‌ చెక్‌ చేసే తేదీని రికార్డ్‌ తేదీ అంటారు. కంపెనీ నిర్దేశించిన తేదీ నాటికి మీ డీమ్యాట్‌ ఖాతాలో ఆ కంపెనీ షేర్లు ఉంటేనే మధ్యంతర డివిడెండ్‌కు అర్హులు అవుతారు. ఇప్పటికే మీ దగ్గర ఈ కంపెనీల షేర్లు ఉండి, ఆ తేదీ వరకు వాటిలో కనీసం ఒక్కటయినా కొనసాగిస్తే మీరు అర్హులు అవుతారు. ఇప్పటి వరకు మీ చేతిలో షేర్లు లేకపోతే.. రికార్డ్‌ తేదీ నాటికి కనీసం రెండు రోజుల ముందే వాటిని కొనాలి. ఎందుకంటే మన స్టాక్‌ మార్కెట్‌లో T+2 ‍‌(కొన్ని స్క్రిప్‌లకు T+1) సెటిల్‌మెంట్‌ పద్ధతి అమలవుతోంది. అంటే, కనీసం రెండు రోజుల ముందు షేర్లు కొంటేనే, రికార్డ్‌ తేదీ నాటికి అవి మీ డీమ్యాట్‌ ఖాతాలోకి వచ్చి చేరతాయి. రికార్డ్‌ డేట్‌ నాడు రికార్డ్స్‌ చెక్‌ చేసే కంపెనీ, ఆ రోజున ఎవరి డీమ్యాట్‌ అకౌంట్‌లో షేర్లు ఉంటే వాళ్లను మధ్యంతర డివిడెండ్‌కు అర్హులుగా నిర్ణయిస్తుంది. రికార్డ్‌ డేట్‌ నాటు సదరు కంపెనీ షేర్లను కొన్నా మధ్యంతర డివిడెండ్‌కు అర్హులు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కంపెనీ ఒక్కో షేరుకు ఎంత మొత్తం డివిడెండ్‌ ప్రకటిస్తుందో, రికార్డ్‌ తేదీన షేరు ధర అంత మేర తగ్గుతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి.


గ్లోస్టర్ కంపెనీ 1:1 బోనస్ షేర్ ఇష్యూను కూడా ప్రకటించింది. పెట్టుబడిదారుడి వద్ద ఉన్న ప్రతి ఒక్క షేరుకు మరో బోనస్‌ షేరును కంపెనీ జారీ చేస్తుంది. ఉదాహరణకు, రికార్డ్‌ తేదీ నాటికి మీ దగ్గర 100 గ్లోస్టర్‌ కంపెనీ షేర్లు ఉంటే, మరో 100 షేర్లు వచ్చి మీ డీమ్యాట్‌ అకౌంట్‌లో యాడ్‌ అవుతాయి.


బోనస్‌ షేర్లు అంటే..
ఒక కంపెనీ బోనస్‌ షేర్లను జారీ చేసిన సందర్భంలోనూ ఆటోమేటిక్‌గా షేర్‌ ధర అడ్జస్ట్‌ అవుతుంది. గ్లోస్టర్ కంపెనీ రెట్టింపు షేర్లను (ఒక షేర్‌కు మరొకటి ఉచితం) బోనస్‌గా ప్రకటించింది కాబట్టి; రికార్డ్ తేదీన ఆ కంపెనీ షేరు ధర ఆటోమేటిక్‌గా సగానికి సగం తగ్గుతుంది. మొత్తం షేర్ల సంఖ్య రెట్టింపు అయినా, ఒక్కో షేర్‌ ధర సగానికి తగ్గడం వల్ల.. వాటి మొత్తం విలువలో ఏ మార్పు ఉండదు. ఉదాహరణకు, ఒక కంపెనీ షేరు ధర రూ.100 అనుకుందాం. మీ దగ్గర ఆ కంపెనీకి చెందిన 10 షేర్లు ఉన్నాయని అనుకుందాం. వాటి మొత్తం షేర్ల విలువ రూ.1000 (100 X 10) అవుతుంది. ఆ కంపెనీ 1:1 బోనస్‌ షేర్లను ప్రకటిస్తే, రికార్డ్‌ తేదీ తర్వాత మీ డీమ్యాట్‌ ఖాతాలోకి మరో 10 షేర్లు వచ్చి చేరతాయి. మొత్తం షేర్లు 20 (10+10) అవుతాయి. కానీ, రికార్డ్‌ తేదీన షేరు ధర ఆటోమేటిక్‌గా సగానికి సగం ( 1:1 నిష్పత్తి ప్రకారం) తగ్గి రూ.50 అవుతుంది. బోనస్‌ షేర్లు వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర ఉన్న షేర్ల మొత్తం విలువ వెయ్యి రూపాయలే (50 X 20) అవుతుంది. కాబట్టి, బోనస్‌ షేర్ల వల్ల షేర్ల సంఖ్య పెరుగుతుంది తప్ప, వాటి మొత్తం విలువ పెరగదని అర్ధం చేసుకోవాలి.


మల్టీబ్యాగర్‌ స్టాక్‌
గ్లోస్టర్ లిమిటెడ్‌ ఒక మల్టీబ్యాగర్‌ స్టాక్‌. గత మూడు సంవత్సరాల్లో ఇది 141 శాతం రాబడిని అందించింది. గత ఒక సంవత్సర కాలంలో ఇది 50% పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూసినా దాదాపు 57% లాభాలను అందించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.