Multibagger infra stock: గత రెండేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్‌ అందించిన IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, రేపు (బుధవారం, 22 ఫిబ్రవరి 2023) ఎక్స్‌-స్ల్పిట్‌లో (ex-split) ట్రేడవుతుంది. ఈ కంపెనీ, రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌ను రూ.1 విలువ కలిగిన షేర్లుగా విభజిస్తోంది. 


ఇవాళ మీ దగ్గర 1 షేర్‌ ఉంటే, స్టాక్‌ స్ల్పిట్‌ (Stock split) తర్వాత అవి 10 షేర్లుగా మారతాయి. అంటే ఒక్కో షేరుకు మరో 9 షేర్లు వచ్చి మీ డీమ్యాట్‌ అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ ప్రాతిపదికన.. మీరు ఎన్ని షేర్లు కొంటే అందుకు 9 రెట్ల షేర్లు వచ్చి మీ ఖాతాలో యాడ్‌ అవుతాయి. ఉదాహరణకు.. మీ దగ్గర ఇప్పటికే 100 షేర్లు ఉన్నా, లేదా మీరు ఇవాళ 100 షేర్లు కొన్నా మరో 900 షేర్లు వచ్చి యాడ్‌ అవుతాయి. మొత్తం షేర్లు 1000 (కొన్న 100 షేర్లు + కొత్తగా వచ్చే 900 షేర్లు) అవుతాయి.  

రికార్డ్ డేట్‌ ఫిబ్రవరి 22
ఈ స్టాక్ స్ప్లిట్‌ కోసం వాటాదార్ల అర్హతను నిర్ణయించేందుకు ఫిబ్రవరి 22ను రికార్డ్ డేట్‌గా కంపెనీ నిర్ణయించింది. రికార్డ్‌ తేదీ నాడు లేదా ఆ ముందు తేదీ వరకు కంపెనీ షేర్లు కలిగిన ఉన్న పెట్టుబడిదార్ల డీమ్యాట్ ఖాతాల్లోకి కొత్త షేర్లను యాడ్‌ అవుతాయి. 


సాధారణంగా, మార్కెట్‌లో స్టాక్ లిక్విడిటీని పెంచడానికి, ఎక్కువ ధరలో ఉన్న స్టాక్‌ను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి, షేర్ల క్రయవిక్రయాలు పెంచడానికి స్టాక్ స్ప్లిట్‌లు జరుగుతుంటాయి. 


ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే... IRB ఇన్‌ఫ్రా స్టాక్‌ స్ప్లిట్‌ రేషియో ప్రకారం స్టాక్ ధర కూడా సర్దుబాటు అవుతుంది. అంటే, షేర్‌ ధర 10తో భాగిస్తారు. ఉదాహరణకు, IRB ఇన్‌ఫ్రా షేర్‌ ధర రూ. 290గా ఉంటే, దానిని 10తో భాగించి, ఒక్కో షేర్‌ ధరను రూ. 29గా నిర్ణయిస్తారు, స్టాక్‌ స్ప్లిట్‌ తర్వాత ఇదే ధర మనకు కనిపిస్తుంది. అంటే, షేర్ల సంఖ్య ఏ ప్రాతిపదికన పెరుగుతుందో, షేర్‌ ధర అదే ప్రాతిపదికన తగ్గుతుంది. ఓవరాల్‌గా చూస్తే మీ పోర్ట్‌ఫోలియోలో విలువ మారదు. 


ఆదాయాలు, రేటింగ్‌ + టార్గెట్‌ ప్రైస్‌
ఏడాది ప్రాతిపదికన, 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ లాభం దాదాపు రెట్టింపై రూ. 141 కోట్లకు చేరుకుంది. 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో రూ. 73 కోట్ల లాభాన్ని IRB ఇన్‌ఫ్రా ఆర్జించింది. ఇదే కాలంలో ఆదాయం రూ. 1,497.78 కోట్ల నుంచి రూ. 1,570 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ. 1,280.22 కోట్ల నుంచి గణనీయంగా తగ్గి రూ. 351.72 కోట్లకు చేరాయి.


ఈ స్టాక్‌కు యెస్‌ సెక్యూరిటీస్‌ 'బయ్‌' రేటింగ్‌, రూ. 328 టార్గెట్‌ ప్రైస్‌ ఇచ్చింది. కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ కూడా 'బయ్‌' రేటింగ్‌ రూ. 340 టార్గెట్‌ ధర ఇచ్చింది. HDFC సెక్యూరిటీస్‌ 'యాడ్‌' రేటింగ్‌తో రూ. 306 టార్గెట్‌ ప్రైస్‌ ఇచ్చింది.