Anant Ambani Birthday: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఈ రోజు (10 ఏప్రిల్ 2024) తన 29వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అతని పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరోసారి భారీ స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాధికతో పెళ్లికి ముందు వచ్చిన ఈ పుట్టిన రోజున అనంత్ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఇటీవల, జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా ప్రపంచ స్థాయి పెద్దలంతా ప్రి-వెడ్డింగ్‌ సెరెమొనీలో పాల్గొన్నారు. 


అనంత్ అంబానీ జీవిత విశేషాలు


ప్రస్తుతం, తన తండ్రి ముకేష్ అంబానీ మార్గదర్శకత్వంలో రిలయన్స్ ఎనర్జీకి అనంత్ అంబానీ నాయకత్వం వహిస్తున్నారు. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ల బోర్డుల్లో కూడా మెంబర్‌గా ఉన్నారు. అనంత్ అంబానీ ముంబైలో జన్మించారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. USAలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి కాలేజ్‌ డిగ్రీ పూర్తి చేశారు. 


డైరెక్టర్ల బోర్డ్‌, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రిలయన్స్ నుంచి అనంత్ అంబానీకి ఫీజ్‌లు అందుతాయి. ఆయా కంపెనీలు సంపాదించిన లాభాలపై కమీషన్ కూడా వస్తుంది.


108 కిలోల బరువు తగ్గిన అనంత్ అంబానీ
గతంలో అనంత్‌ అంబానీ చాలా లావుగా ఉండేవారు, భారీ స్థాయి ఊబకాయంతో ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత... ప్రత్యేక జిమ్‌ ట్రైనర్‌, డైటీషియన్‌ నేతృత్వంలో అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గారు. కానీ, అకస్మాత్తుగా అతని బరువు మరోసారి పెరిగింది. ఈ విషయం గురించి అనంత్ అంబానీ తన ప్రి వెడ్డింగ్ ఫంక్షన్‌లో వివరించారు. తన అనారోగ్యం గురించి మాట్లాడారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అనంత్ తల్లి నీతా అంబానీ కూడా అనంత్ అనారోగ్యం గురించి చెప్పారు. అతను చిన్నతనం నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాడని వివరించారు. అతను ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడేవాడని, ఆస్తమాను నియంత్రణలో పెట్టడానికి స్టెరాయిడ్స్ తీసుకోవడం భారీగా బరువు పెరిగాడని వెల్లడించారు. ఆ తర్వాత, 2016లో అనంత్ 108 కిలోల బరువు తగ్గాడు. కానీ, ఆస్తమా మందులు వాడడం వల్ల ఊబకాయం మళ్లీ వచ్చింది. 


అన్న, అక్క అంటే అపారమైన ప్రేమ & గౌరవం
ఇటీవలి ఇంటర్వ్యూలో, అనంత్ అంబానీ తన సోదరుడు ఆకాష్ అంబానీ, సోదరి ఇషా అంబానీ గురించి మాట్లాడారు. తమ ముగ్గురి మధ్య అపారమైన ప్రేమ ఉందని, ఒకరిపై ఒకరికి ఎనలేని నమ్మకం ఉందని చెప్పారు. తమ మధ్య ఎలాంటి పోటీ లేదన్నారు. తన సోదరుడు ఆకాష్‌ను రాముడిలా చూస్తానని, అతను చెప్పిన పనిని లక్ష్మణుడిలా నిర్వర్తిస్తానని చెప్పారు. తన సోదరి ఇషాను తాను తల్లిలా భావిస్తానని అన్నారు. 


జంతువులంటే చాలా ఇష్టం
అనంత్ అంబానీకి జంతువులంటే కూడా చాలా ఇష్టం. జంతువులకు సేవ చేసేందుకు ఎన్నో పనులు చేస్తూనే ఉంటాడు. తన తల్లి నీతా అంబానీ జంతువులను ప్రేమించడం గురించి తనకు చిన్నతనం నుంచి నేర్పిందని ఒక ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ చెప్పారు. పెంపుడు జంతువులతో గడిపేంగదుకు అనంత్‌ చాలా ఆసక్తి చూపుతారు.


అనంత్ అంబానీ పేరిట ఉన్న ఆస్తిపాస్తులు
ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. డీఎన్ఏ రిపోర్ట్‌ ప్రకారం, అనంత్ అంబానీ మొత్తం సంపద ‍‌(Anant Ambani Networth) రూ. 3,44,000 కోట్లు. తన కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో కనిపించారు. విలాసవంతమైన రోల్స్ రాయిస్‌ కారులో ఈ యువ జంట షాపింగ్‌కు వెళ్లారు. వాళ్లతో దుబాయ్‌ రోడ్లపై తిరిగిన కాన్వాయ్‌లో 20 కార్లు, ఒక అంబులెన్స్‌ ఉన్నాయి. ఆ మొత్తం కార్‌ ఫ్లీట్‌ విలువ రూ.25 కోట్ల పైమాటేనట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ‍‌(Anant Ambani - Radhika Merchant Marriage) ఎక్కబోతున్నారు. ఈ ఏడాది జులై 12న ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.


మరో ఆసక్తికర కథనం: మరో రికార్డ్‌ సృష్టించిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి