Reliance Industries: కంటికి కనిపించిన ప్రతి వస్తువు ఉత్పత్తిలో కాళ్లు, వేళ్లు పెడుతూ వెళ్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ, ఇప్పుడు ఐస్‌క్రీమ్‌ మీద కన్నేశారు. భారత్‌లో 20 వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఐస్‌క్రీం తయారీ రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించనుంది. అయితే, ఈ విషయం ఇంకా అధికారికంగా రూఢీ కాలేదు.


"ఇండిపెండెన్స్" బ్రాండ్‌తో ఐస్‌క్రీమ్‌ అమ్మకం           
కొందరు వ్యక్తులు చెప్పిన సమాచారం ప్రకారం.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు ‍‌(Reliance Retail Ventures) చెందిన FMCG కంపెనీ "రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌" (Reliance Consumer Products), ఐస్‌క్రీమ్‌ తయారీ, అమ్మకాల్లోకి అడుగు పెట్టబోతోంది. "ఇండిపెండెన్స్" (INDEPENDENCE) బ్రాండ్‌ లేదా మరేదైనా కొత్త పేరుతో ఐస్ క్రీమ్స్‌ తయారు చేసి, అమ్మవచ్చు.        


ఐస్ క్రీం ఉత్పత్తిని రిలయన్స్‌ అవుట్ సోర్సింగ్ చేసే అవకాశం ఉంది. అంటే, ఇప్పటికే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న ఏదైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని తన బ్రాండ్‌తో మార్కెట్‌లోకి తీసుకురావచ్చు, లేదా, కొత్త కంపెనీకి ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తి బాధ్యతను అప్పగించవచ్చు. రిలయన్స్‌ రిటైల్‌ అధికారులు గుజరాత్‌లోని ఓ కంపెనీతో ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని, ఆ చర్చలు తుది దశలో ఉన్నాయన్నది  విశ్వసనీయ వర్గాల సమాచారం. 


ఈ వేసవిలోనే రిలయన్స్‌ ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రావచ్చు. "ఇండిపెండెన్స్" బ్రాండ్‌తో లేదా బ్రాండ్ లెస్‌గా ఈ ఐస్ క్రీం మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే, "ఇండిపెండెన్స్" బ్రాండ్‌తో వంట నూనె, పప్పులు, బియ్యం వంటి ఆహార పదార్థాలను రిలయన్స్‌ విక్రయిస్తోంది. 


అమూల్‌కు పోటాపోటీ             
ఐస్‌క్రీమ్‌ అమ్మకాల్లోకి రిలయన్స్‌ అడుగు పెడితే, ఈ మార్కెట్‌లో పెద్ద మార్పు చూస్తామని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం.. ఐస్‌ క్రీమ్‌ రంగంలో ప్రముఖ కంపెనీలు హావ్‌మోర్‌ ఐస్‌క్రీమ్స్‌, వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌, అమూల్‌ ఉన్నాయి, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. డెయిరీ రంగంలో అనుభవం ఉన్న ఆర్‌ఎస్ సోధిని కొన్ని రోజుల క్రితం తన టీమ్‌లోకి రిలయన్స్ తీసుకుంది. సోధి, అమూల్‌లో కొంతకాలం పని చేశారు. ఆయన అనుభవం ఇప్పుడు రిలయన్స్‌కు ఉపయోగపడుతుంది. కాబట్టి, రిలయన్స్‌ అడుగు పెడితే ఐస్‌ క్రీమ్‌ సెగ్మెంట్‌లో, ముఖ్యంగా అమూల్‌కు పోటీ బాగా పెరిగే అవకాశం ఉంది. తన ఉత్పత్తిని జనానికి అలవాటు చేయడానికి, చాలా తక్కువ ధరతో ఐస్‌ క్రీమ్‌ను అమ్మే అవకాశం ఉంది. కాబట్టి... రిలయన్స్ ఐస్ క్రీం ధర, దాని ఉత్పత్తి ఎలా ఉంటుందనే దానిపై నిపుణులు ఆసక్తిగా ఉన్నారు.


భారత్‌లో ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌ విలువ 20 వేల కోట్ల రూపాయలు. ఇందులో 50 శాతం సంఘటిత రంగంలో (బ్రాండెడ్‌) ఉంది. వచ్చే ఐదేళ్లలో ఐస్‌క్రీం మార్కెట్‌లో మరింత భారీ వృద్ధి రేటు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతం నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. రిలయన్స్‌తో పాటు మరి కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.