Mukesh Ambani joins 100 billion dollars club: భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ (Mukesh Ambani), కొత్త సంవత్సరంలో గొప్ప మైలురాయిని దాటారు. గురువారం (11 జనవరి 2023), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్‌ ధర (Reliance Industries Share Price) పెరిగి కొత్త రికార్డును సృష్టించింది. దీంతో, భారత్‌తో పాటు మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న అంబానీ సంపద ఇంకా విపరీతంగా పెరిగింది. దీంతో, ముకేష్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మరోమారు అడుగు పెట్టారు.


ముకేష్ అంబానీ ఆస్తుల విలువ ఇది
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్‌ (Forbes Real-Time Billionaires List) ప్రకారం, ముకేష్ అంబానీ సంపద విలువ (Mukesh Ambani Networth) $105.2 బిలియన్లకు చేరింది. గురువారం, ఆ ధనవంతుడి ఆస్తిపాస్తుల విలువ 2.7 బిలియన్ డాలర్లు (2.66 శాతం) జంప్ చేసింది. దీంతో, ప్రపంచంలోని 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న సంపన్నుల లిస్ట్‌లోకి ముకేష్ అంబానీ మరోసారి చేరారు. ఇప్పుడు, ఫోర్బ్స్ జాబితాలో ముకేష్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు.


ఫోర్బ్స్‌ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్‌లో.. 100 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులు 12 మంది మాత్రమే ఉన్నారు. ఈ లిస్ట్‌ ప్రకారం గౌతమ్‌ అదానీ 16వ స్థానంలో నిలిచారు.


బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్‌ ప్రకారం ఇలా..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) ప్రకారం, ముకేష్ అంబానీ సంపద $100 బిలియన్ల మార్కుకు కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. ఈ సూచీ ప్రకారం, అంబానీ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం 99 బిలియన్ డాలర్లుగా ఉంది, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు.


గౌతమ్ అదానీ సంపద విలువ
రిలయన్స్‌ షేర్‌ ప్రైస్‌ జంప్‌ తర్వాత, ముకేష్‌ అంబానీ - గౌతమ్‌ అదానీ సంపద మధ్య దూరం మరింత పెరిగింది. 'భారత్‌ & ఆసియాలో అత్యంత ధనవంతుడు' కిరీటాన్ని గౌతమ్‌ అదానీ నుంచి మళ్లీ వెనక్కు తీసుకున్న అంబానీ, ఇప్పుడు తన స్థాయిని ఇంకా పెంచుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం... గౌతమ్ అదానీ నికర విలువ (Gautam Adani Networth) ప్రస్తుతం $96.8 బిలియన్లుగా ఉంది. ఈ సంపదతో, అదానీ, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 14వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ జాబితా ప్రకారం చూస్తే, గౌతమ్ అదానీ 79.4 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో ఉన్నారు.


రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ (Reliance Industries Market Capitalization)
రిలయన్స్‌ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు ఇటీవలి రోజుల్లో మంచి ర్యాలీ చేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సరికొత్త ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి (All time high) రూ.2,725కి చేరుకున్నాయి. ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్‌ షేరు 2.50 శాతం లాభంతో రూ.2,718 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి. దీంతో, గురువారం ట్రేడ్‌ ముగిసే సమయానికి, భారతదేశంలోని అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ రూ.18.39 లక్షల కోట్లకు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి