Adani Group Stocks: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ బ్యాడ్‌ టైమ్‌ కొనసాగుతోంది. గ్లోబల్ బ్యాంకర్స్‌ సిటీ గ్రూప్ (Citi Group), క్రెడిట్ సూయిస్ (Credit Suisse) అదానీ కంపెనీల బాండ్లకు విలువ లేదని ప్రకటించి, ఆ సెక్యూరిటీలను తనఖా పెట్టుకోవడం ఆపేసిన ఫలితం ఇవాళ కూడా (గురువారం, 02 ఫిబ్రవరి 2023) కూడా కనిపించింది. అదానీ గ్రూప్‌లోని చాలా స్టాక్స్‌ ఇవాళ ఇంట్రాడే కనిష్టాలకు పడిపోయాయి, లోయర్ సర్క్యూట్స్‌లో లాక్ అయ్యాయి.


20,000 కోట్ల రూపాయల FPOను అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) వెనక్కు తీసుకోవడం కూడా నెగెటివ్‌ సెంటిమెంట్‌కు ఆజ్యం పోసింది. ఈ కంపెనీ షేర్లు 14% పతనమై రూ. 1,821.05 స్థాయికి పడిపోయాయి.


 లోయర్ సర్క్యూట్స్‌లో అదానీ స్టాక్స్‌
10% నష్టంతో లోయర్ సర్క్యూట్స్‌లో చిక్కుకున్న 4 అదానీ స్టాక్స్‌ - అదానీ ట్రాన్స్‌మిషన్ ‍‌(Adani Transmission) రూ. 1,557.25 వద్ద, అదానీ పోర్ట్స్ ‍‌(Adani Ports) రూ. 441.85 వద్ద, అదానీ ట్రాన్స్‌మిషన్ ‍‌(Adani Transmission) రూ.1,557.25 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) రూ.1,038.05 వద్ద లోయర్‌ సర్క్యూట్‌.


10% నష్టంతో లోయర్ సర్క్యూట్స్‌లో చిక్కుకున్న 3 అదానీ స్టాక్స్‌ - ఎన్‌డీటీవీ (NDTV), అదానీ పవర్ (Adani Power), అదానీ విల్మార్ (Adani Wilmar)


అదానీ గ్రూప్‌ ఇటీవల కొనుగోలు చేసిన కంపెనీలు - ACC అతి స్వల్పంగా తగ్గి రూ. 1,835.40 వద్ద ఉండగా, అంబుజా సిమెంట్స్ ‍‌(Ambuja Cements) 2.5% పెరిగి రూ. 342.80కి చేరుకుంది.


అమెరికన్ షార్ట్ సెల్లర్ & విజిల్ బ్లోయర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research), అదానీ గ్రూప్‌ కంపెనీల మీద గత వారం (జనవరి 24న) అనేక ఆరోపణలు చేసిన తర్వాత అదానీ స్టాక్స్‌లో ఇబ్బంది మొదలైంది. బుధవారం, క్రెడిట్ సూయిస్ అదానీ బాండ్లను తాకట్టుగా స్వీకరించడం మానేసిన తర్వాత ఆ నష్టం మరింత పెరిగింది.


స్టాక్స్‌ పతనం తీవ్రం కావడంతో, అదానీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ FPOని ఉపసంహరించుకుంది. 


అగ్నికి ఆజ్యం పోసిన సిటీ గ్రూప్‌
ఈ ఉదయం (గురువారం), సిటీ గ్రూప్‌ కూడా క్రెడిట్‌ సూయిస్‌ తరహా ప్రకటన చేసింది. అదానీ సెక్యూరిటీలపై లోన్-టు-వాల్యూ నిష్పత్తిని (loan-to-value ratio) సున్నాకి తగ్గించాలని నిర్ణయించింది. 


క్యాపిటల్ మార్కెట్ కాస్త నిలదొక్కుకున్న తర్వాత తమ వ్యూహాన్ని సమీక్షిస్తానని పేర్కొన్న అదానీ, FPO ఉపసంహరణ నిర్ణయం ప్రస్తుత కార్యకలాపాలు & భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యంగా ఉంది, ఆస్తులు పటిష్టంగా ఉన్నాయని వివరించారు.


గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో, మొత్తం 10 లిస్టెడ్ అదానీ కంపెనీల మార్కెట్ విలువ మూడింట ఒక వంతుకు పైగా ‍‌(33% పైగా) తగ్గింది. గత కొన్ని సంవత్సరాలుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధరలో విపరీతమైన ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం ఈ స్క్రిప్‌, తన 52 వారాల గరిష్ట స్థాయి నుంచి దాదాపు 50% తగ్గింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.