Moody's - Adani Group: 2023 జనవరి 24న, అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research), అదానీ గ్రూప్ కంపెనీల మీద ఇచ్చిన నివేదిక తర్వాత వరుసగా పడుతున్న దెబ్బలకు అదానీ గ్రూప్ విలవిల్లాడుతోంది. తాజా దెబ్బ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (Moody) కొట్టింది. అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీల రేటింగ్‌ను మూడీస్ మార్చింది, వాటి దీర్ఘకాలిక రేటింగ్‌ను "స్టేబుల్" నుంచి "నెగిటివ్"కు తగ్గించింది.
నెగెటివ్ రేటింగ్ కంపెనీలు ఇవే:
మూడీస్ నుంచి నెగెటివ్ రేటింగ్ పొందిన కంపెనీలు - అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ గ్రీన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్(ఏజీఈఎల్ ఆర్‌జీ-1), అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్- వన్ (Adani Transmission Step-One), అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి (Adani Electricity Mumbai).
8 కంపెనీల రేటింగ్‌లు యథాతథం
అదానీ గ్రూప్‌లోని మరో 8 కంపెనీల రేటింగ్‌ను మూడీస్ యథాతథంగా కొనసాగించింది. రేటింగ్ మారని అదానీ గ్రూప్ కంపెనీలు - అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (Adani Ports and Special Economic Zone), అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani International Container Terminal), అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూప్ (Adani Green Energy Restricted Group 2), అదానీ ట్రాన్స్‌మిషన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్ 1 (Adani Transmission Restricted Group 1), వార్ధ సోలార్ (మహారాష్ట్ర) ప్రైవేట్ లిమిటెడ్, కొడంగల్ సోలార్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ (RJ) లిమిటెడ్, బర్మర్ పవర్ ట్రాన్స్‌మిషన్ సర్వీస్ లిమిటెడ్, రాయ్‌పూర్-రాజ్‌నంద్‌గావ్-ఒరోరా ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, సిపట్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, థార్ పవర్ ట్రాన్స్‌మిషన్ సర్వీస్ లిమిటెడ్, హదౌతి పవర్ ట్రాన్స్‌మిషన్ సర్వీస్ లిమిటెడ్, ఛత్తీస్‌గఢ్-WR ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్.
మూడీస్ ఏం చెప్పింది?
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనం అయ్యాయి, 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ అతి వేగంగా తగ్గడం వల్లే రేటింగ్ తగ్గించినట్లు మూడీస్ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ గ్రూప్ చెల్లించాల్సిన రుణాల మొత్తం 2.7 బిలియన్ డాలర్లుగా ఉండడంతో నెగెటివ్ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చిందని మూడీస్ పేర్కొంది. భారీగా పెరిగిన మూలధన వ్యయాలు, బయటి మద్దతుపై గ్రూప్ కంపెనీలు ఆధారపడడం వంటి ఇతర అంశాలు కూడా నెగెటివ్ రేటింగ్‌కు కారణంగా నిలిచాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.