Mobile Phone Exports: మన దేశం నుంచి నెలవారీ మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు రికార్డ్‌ సృష్టించాయి. మొదటిసారిగా, సెప్టెంబర్‌లో ఒక బిలియన్ డాలర్ల (8,200 కోట్ల రూపాయలు) స్థాయిని దాటాయి. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (Production Linked Incentive - PLI) పథకం దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీని బాగా ప్రోత్సహించింది. ఆపిల్, శాంసంగ్ వంటి గ్లోబల్ ప్లేయర్లకు గవర్నమెంట్‌ సపోర్ట్ దొరకడంతో ఉత్పత్తిని అవి విపరీతంగా పెంచాయి. రికార్డ్‌ స్థాయి ఎగుమతులను లీడ్‌ చేశాయి.


ఇంతకుముందు, సెల్‌ఫోన్‌ల అత్యధిక నెలవారీ ఎగుమతి రికార్డ్‌ 2021 డిసెంబర్‌లోని 770 మిలియన్‌ డాలర్లు. ఈ ఏడాది జూన్, జులై ఆగస్టు నెలల్లో ఎగుమతులు దాదాపు 700 మిలియన్‌ డాలర్లకు చేరాయి. సెప్టెంబర్‌లో ఒక బిలియన్‌ డాలర్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి.


అందుబాటులో ఉన్న డేటా ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్‌) మొబైల్ ఫోన్ ఎగుమతులు 4.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2021 సంబంధిత కాలంలోని 1.7 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే, ఈ ఏడాది ఎగుమతులు రెండింతలు పెరిగాయి. 


200% YoY గ్రోత్‌
ఈ ఏడాది సెప్టెంబర్‌లో, మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ 2021 సెప్టెంబర్ (YoY) కంటే 200 శాతం ‍‌పైగా పెరిగింది. 


2020 ఏప్రిల్‌లో, స్మార్ట్‌ఫోన్ల తయారీ కోసం ₹40,995 కోట్ల PLI స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యాపిల్‌ కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు Foxconn, Wistron, Pegatronతోపాటు శామ్‌సంగ్‌ ఆ పథకాన్ని ఉపయోగించుకుని, ఎగుమతుల వృద్ధిని ముందుండి నడిపించాయి.


FY26 నాటికి $60 బిలియన్ల లక్ష్యం
మన దేశంలో జరుగుతున్న మొబైల్‌ ఫోన్‌ ఎగుమతుల్లో, గ్లోబల్ మేజర్స్‌ యాపిల్‌, శామ్‌సంగ్ వాటా దాదాపు 75-80 శాతం.


ఇండియా సెల్యూలార్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్ (ICEA) డేటా ప్రకారం... మొబైల్ ఫోన్‌ల ఎగుమతులు 2016-17లోని ఉత్పత్తిలో కేవలం 1 శాతంగా మాత్రమే ఉన్నాయి. 2021-22లో ఇది 16 శాతానికి పెరిగింది. 2022-23 ఉత్పత్తిలో దాదాపు 22 శాతానికి పెరుగుతుందని ఈ అసోసియేషన్ అంచనా వేస్తోంది.


స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతిలో ప్రస్తుతం చైనా, వియత్నాం ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. భారత్‌ కూడా ఆ స్థాయికి చేరుకోవడమే 2020 PLI స్కీమ్‌ ఉద్దేశం. 2025-26 నాటికి 60 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లసను ఎగుమతి చేయాలన్నది భారత్ లక్ష్యం.


మన దేశం నుంచి జరుగుతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల ఎగుమతుల్లో స్మాట్‌ ఫోన్లదే అగ్ర పీఠం. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మొత్తం ఎలక్ట్రానిక్స్ పరికరాల ఎగుమతి 2021-22లోని $6.5 బిలియన్ల నుంచి 54% పెరిగి $10.2 బిలియన్లకు చేరుకుంది. ఇందులో మొబైల్ ఫోన్ల వాటా దాదాపు 68%గా ఉంది.


భారత్‌లో తయారయిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇప్పుడు UK, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీతో సహా చాలా దేశాలకు రవాణా అవతున్నాయి. గతంలో, ఇవి మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా, దక్షిణాఫ్రికాకు మాత్రమే వెళ్లేవి.


PLI సక్సెస్‌
స్మార్ట్‌ ఫోన్ PLI స్కీమ్‌ విజయవంతం కావడంతో.. ఆటోమొబైల్ & ఆటో విడిభాగాలు, IT హార్డ్‌వేర్, టెలికాం ఎక్విప్‌మెంట్‌ & డిజైన్, ఫార్మాస్యూటికల్స్, సోలార్ మాడ్యూల్స్, మెటల్స్ & మైనింగ్, టెక్స్‌టైల్స్, వైట్ గూడ్స్, డ్రోన్లు, డ్రోన్‌లు, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్‌ వంటి 14 రంగాల కోసం కూడా ఇలాంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.