Markets Respond Positively As FM Sitharaman Presents Budget 2025: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆమె బడ్జెట్ స్పీచ్ ముగిసే సరికి లాభాల్లోకి వచ్చాయి. రెడ్ నుంచి గ్రీన్ లోకి మారిపోయాయి. సెన్సెక్స్ గత ముగింపుతో పోలిస్తే 746 పాయింట్లు మేర పెరిగింది.  77,505 పాయింట్ల వద్ద ముగిసింది.   ఓ దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌   900 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. తర్వాత  కోలుకుంది.   






జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయింది. బడ్జెట్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రకటించిన క్రమంలో అగ్రి స్టాక్స్ రాణించాయి. క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఆయా రంగాల షేర్లు రాణించాయి. ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ప్రస్తుతం ఉన్న 74 శాతం ఎఫ్‌డీఐలను 100 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించడంతో స్టార్ హెల్త్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.  


సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్‌టీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. జొమాటో, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు లాభాల్లో ముగిశాయి. 


సాధారణంగా స్టాక్ మార్కెట్లు బడ్జెట్ రోజున సున్నితంగా స్పందిస్తూ ఉంటాయి. పారిశ్రామిక రంగానికిప్రోత్సాహాకాలు ఉంటే.. ఏ ఏ రంగాలకు రాయితీలు వచ్చాయో చూసుకుని ఆయా రంగాల్లో స్టాక్స్ పెరుగుతాయి. అయితే ఈ బడ్జెట్ ప్రధానంగా మధ్యతరగతికి మేలు చేసేదిగా రూపొందించారన్న ప్రచారంతో బడ్జెట్ ముగియనే చాలా మంది లాభాల స్వీకరణకు దిగారు. తర్వాత ప్రోత్సాహకాలు ఉన్నాయన్న విశ్లేషణతో మళ్లీ కొనడం ప్రారంభించారు. ఇలా గందరగోళం మధ్య స్టాక్ మార్కెట్ రోజంతా కొనసాగింది. అయితే చివరిగా అంతాపాజిటివ్ గానే ఉండటంతో సెన్సెక్స్ గ్రీన్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ మాత్రం స్వల్ప నష్టాలను చూసింది.                  


బడ్జెట్ పై అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల.. స్టాక్ మార్కెట్ ఎగుడుదిగుడుగా ఉందని కొంత మంది విశ్లేషకులు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు.