LIC Q4 Results Net Profit Falls 18 Per Cent, Insurer Declares Dividend Of Rs 1.5 : ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. 2021-22 ఆర్థిక ఏడాదిలో జనవరి-మార్చి క్వార్టర్లో రూ.2,371 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.2,893 కోట్లతో పోలిస్తే 18 శాతం తగ్గింది. అయితే 2021 ఏడాది చివరి క్వార్టర్‌ ఫలితాలు సంవత్సరం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఈ రెండు ఫలితాలను పోల్చొద్దని కంపెనీ వివరించింది.


'ఎల్‌ఐసీ Q4FY21లో రూ.2,893 కోట్ల లాభం ఆ సంవత్సరం మొత్తానికి చెందుతుంది. ఎందుకంటే అప్పటి వరకు కంపెనీ ఏడాదికోసారి మాత్రమే ఫలితాలను ప్రకటించేది. అందుకే ఇప్పటి ఫలితాలను అప్పటితో పోల్చడం సరికాదు. 2022లో కంపెనీ పన్నులు చెల్లించిన తర్వాత రూ.4,043 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాది రూ.2900 కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగింది. వచ్చే ఏడాది నుంచి త్రైమాసిక ఫలితాలను పోల్చేందుకు డేటా పాయింట్స్‌ దొరుకుతాయి' అని ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ అన్నారు.


2022 ఆర్థిక ఏడాదిలో ఎల్‌ఐసీ రూ.4,043 కోట్ల నికర లాభం నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది రూ.2900 కోట్ల లాభంతో పోలిస్తే 39.4 శాతం పెరిగింది. స్టాక్‌ మార్కెట్లో నమోదైన తర్వాత ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్‌ను (LIC dividend) ప్రకటించింది. రూ.10 ఫేస్‌వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 వరకు డివిడెండ్‌ ఇవ్వనుంది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.916 కోట్ల ఆదాయం వస్తుంది. 


మంగళవారం మధ్యాహ్నం ఎల్‌ఐసీ షేరు ధర రూ.816 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూ.21 నష్టంతో ఉంది. ఉదయం రూ.810 వద్ద ఓపెనైన స్టాక్‌ రూ.822 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. రూ.810 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది. 52 వారాల గరిష్ఠ ధర రూ.918 కాగా కనిష్ఠ ధర రూ.801గా ఉంది.