LIC investments: దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), వచ్చే ఆర్థిక సంవత్సరం ‍‌(2023-24 లేదా FY24) కోసం భారీ ప్లాన్‌ వేసింది. ఏకంగా 2.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. ఏప్రిల్ 1 నుంచే వివిధ కంపెనీల్లో షేర్ల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెడుతున్న అతి పెద్ద, రికార్డ్‌ స్థాయి పెట్టుబడి ఇదే. FY24లో భారతీయ మార్కెట్‌కు ముఖ్యమైన మద్దతు వ్యవస్థగా ఈ జీవిత బీమా సంస్థ నిలబడబోతోంది. దీనివల్ల, ఎల్‌ఐసీ షేర్‌హోల్డర్లు, ఎల్‌ఐసీ కొనబోయే కంపెనీల షేర్‌హోల్డర్లు మాత్రమే కాదు, ఎల్‌ఐసీ పాలసీదార్లు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. 


ఎల్‌ఐసీ ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
తన మొత్తం పెట్టుబడిలో దాదాపు 35 శాతం, అంటే రూ. 80 వేల కోట్ల నుంచి రూ. 85 వేల కోట్ల వరకు భారత్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్ల కోసం ఎల్‌ఐసీ కేటాయించవచ్చని మింట్‌ రిపోర్ట్‌ చేసింది. చాలా మంది పెట్టుబడిదారులు రిస్క్ భయంతో భారతదేశం సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల (ఎమర్జింగ్‌ మార్కెట్లు) నుంచి వెనక్కి తగ్గుతున్న సమయంలో LIC ఈ స్కీమ్‌తో ముందుకు వచ్చింది. ప్రపంచ సంక్షోభ ఆందోళనల్లో నలిగిపోతున్న భారత మార్కెట్‌ను ఈ పెట్టుబడి బలోపేతం చేయగలదు.


వెనక్కు లాగుతున్న విదేశీ ఇన్వెస్టర్లు
మార్చి 24న, విదేశీ ఇన్వెస్టర్లు ‍‌(FPIs) రూ. 1,720.44 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించగా, బీమా కంపెనీలు సహా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2,555.53 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. 


జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎఫ్‌పీఐలు వరుసగా రూ. 28,852 కోట్లు, రూ. 5,294 కోట్ల విలువైన షేర్లను ‍‌(net outflows) నికరంగా విక్రయించారు. మార్చి నెలలో, ₹7,233 కోట్లతో (USకు చెందిన GQG పార్ట్‌నర్స్‌ అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం వల్ల) FPIలు నికర కొనుగోలుదార్లుగా (net buyers) ఉన్నారు. 


ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు చూస్తే (YTD), భారతీయ ఈక్విటీల్లో నికరంగా రూ. 26,913 కోట్ల అమ్మకాలతో నికర విక్రయదార్లుగా కొనసాగుతున్నాయి. 2022లో, మొత్తం రూ. 1.21 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు.


ఇతర మార్గాల్లోనూ LIC పెట్టుబడులు
ఈక్విటీలతో పాటు.. భారత ప్రభుత్వ బాండ్‌లు లేదా గవర్నమెంట్‌ సెక్యూరిటీలు, స్టేట్ డెవలప్‌మెంట్ లోన్‌లు, సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్‌లలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు పెట్టవచ్చు. 


గత ఏడాది లిస్ట్‌ అయిన తర్వాత, 2022 డిసెంబర్‌లో ఎల్‌ఐసీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకుంది. నికర లాభం 26 రెట్లు పెరిగి రూ. 6,334 కోట్లు మిగిలింది. అదే సమయంలో నికర ప్రీమియం ఆదాయం 15 శాతం పెరిగి రూ. 1.12 లక్షల కోట్లకు చేరుకుంది. పెట్టుబడుల ద్వారా ఎల్‌ఐసీ ఆదాయం డిసెంబర్ చివరి నాటికి రూ. 76,574 కోట్ల నుంచి రూ. 84,889 కోట్లకు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.