Zomato In BSE Sensex Index: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ & శీఘ్ర వాణిజ్య సంస్థ జొమాటో, ఈ రోజు (సోమవారం, 23 డిసెంబర్ 2024) చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి, ఆ కంపెనీ ఇన్వెస్టర్లు & షేర్ హోల్డర్లు, సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal)కు ఇది చాలా ప్రత్యేకమైన & జీవితంలో మరిచిపోలేని రోజు. జొమాటో షేర్లు ఈ రోజు నుంచి BSE సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లోకి అడుగు పెట్టాయి. మన దేశంలో, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయిన అత్యంత విలువైన 30 కంపెనీలు సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఉంటాయి. అంటే, ఇవి దేశంలో టాప్-30 కంపెనీలు.
లిస్ట్ అయిన మూడున్నరేళ్లలో...
జొమాటో, తన IPOని 2021 జులై నెలలో తీసుకు వచ్చింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్, లిస్టింగ్ అయిన మూడున్నర సంవత్సరాల్లో సెన్సెక్స్‌లో భాగమై భారతీయ స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. BSE సెన్సెక్స్‌లో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) స్థానంలో జొమాటో యాడ్ అయింది.
లిస్ట్ అయిన మూడున్నర సంవత్సరాల్లోనే, జొమాటో, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అతి పెద్ద 30 కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. నిజానికి, స్టాక్ మార్కెట్‌లోని న్యూ ఏజ్ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. 20 డిసెంబర్ 2024న, చివరి ట్రేడింగ్ సెషన్ ముగింపు ధర ప్రకారం జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ (Zomato market cap) రూ. 2,72,236 కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈ అనుబంధ సంస్థ 'ఆసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్', BSE సూచీల పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. దానిలో భాగంగా, BSE సెన్సెక్స్ 30 & BSE సెన్సెక్స్ 50లో జొమాటోను చేర్చారు.
మల్టీబ్యాగర్ స్టాక్
ఈ మూడున్నర సంవత్సరాల్లో, జొమాటో స్టాక్ దాని పెట్టుబడిదారులు & వాటాదారులకు రుచికరమైన మల్టీబ్యాగర్ రిటర్న్‌లను వడ్డించింది. జొమాటో, IPO ఇష్యూ ధర రూ. 76 వద్ద మార్కెట్ నుంచి నిధులు సేకరించింది. గత శుక్రవారం, 22 నవంబర్ 2024న, ఈ స్టాక్ రూ. 282.10 వద్ద ముగిసింది. ఈ షేరు గరిష్టంగా రూ. 304.70 వద్దకు కూడా చేరింది. ఈ లెక్క ప్రకారం, ఈ మూడున్నరేళ్లలో జొమాటో షేర్లు 300 శాతం రాబడిని అందించాయి. ఈ స్టాక్ గత రెండేళ్లలో 350 శాతం, 2024లో ఇప్పటి వరకు 130 శాతం రాబడిని ఇచ్చింది. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం, జోమాటో షేర్లు రూ. 500 కూడా దాటవచ్చు.
నిఫ్టీ50లోకి జొమాటో!
ఈ స్టాక్‌ను త్వరలో నిఫ్టీ 50లో కూడా చేర్చవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్‌ను 2025 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు, జొమాటోను నిఫ్టీ 50లో చేర్చడంపై నిర్ణయం తీసుకోవచ్చు. బ్రోకరేజ్ సంస్థ JM ఫైనాన్షియల్ ఇటీవలి నివేదికలో, నిఫ్టీ 50లోకి జొమాటో యాడ్ అవుతుందని అంచనా వేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తిర కథనం: హోమ్ లోన్ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!