Indians Deposits in Swiss Bank: మోదీ మెుదటిసారి ప్రధాని కావటానికి ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో ఆ సొమ్మును జమ చేస్తానని చెప్పారు. మూడోసారి ప్రధానిగా మారినప్పటికీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అయితే మరోపక్క స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచిన భారతీయుల నిల్వలు మాత్రం మరోపక్క కరిగిపోతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారతీయ వ్యక్తులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ము 2023లో ఏకంగా 70 శాతం క్షీణించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల మెుత్తం డబ్బు విలువ రూ.9771 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ గురువారం విడుదల చేసిన వార్షిక డేటా ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం సంపద వరుసగా రెండవ సంవత్సరం భారీ క్షీణతను చూసినట్లు వెల్లడైంది.
2021లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఇండియన్స్ డబ్బు 14 ఏళ్ల గరిష్ఠమైన 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ల భారీ క్షీణతకు కారణాలను అన్వేషిస్తే.. ప్రధానంగా బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక సాధనాలు కారణంగా ఉన్నాయని వెల్లడైంది. కస్టమర్ డిపాజిట్ ఖాతాలలో డిపాజిట్లు, భారతదేశంలోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించబడే నిధులు కూడా గణనీయంగా తగ్గాయని డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ గణాంకాలలో భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు లేదా ఇతరులు మూడవ దేశ సంస్థల పేరుతో స్విస్ బ్యాంకుల్లో కలిగి ఉన్న డబ్బును చేర్చలేదు.
డిపాజిట్లలో నిరంతర క్షీణత:
భారతీయులు 427 మిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లను ఇతర బ్యాంకుల ద్వారా స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఏడాది క్రితం ఇది 111 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లుగా మాత్రమే ఉంది. ఇక్కడి బ్యాంకుల్లో ట్రస్టు ద్వారా జమ అయిన సొమ్ము కోటి స్విస్ ఫ్రాంక్ లుగా నిలిచింది. ఏడాది క్రితం ఇది 24 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా నమోదైంది. భారతీయులు బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర మార్గాల ద్వారా 302 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను పెట్టుబడి పెట్టారు. బ్యాంక్ నివేదిక ప్రకారం 2017, 2020, 2021 మినహా.. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారతీయుల డబ్బు నిరంతరం తగ్గుతూనే ఉన్నట్లు వెల్లడైంది.