Kotak Mahindra Bank: దేశీయంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. టెక్నికల్ ఆడిట్ సమయంలో ఆర్బీఐ అనేక లోపాలను గుర్తించింది. ఇవి వినియోగదారుల భద్రతకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు గమనించింది. దీంతో కస్టమర్ల డిజిటల్ ఆన్ బోర్డింగ్ నిలిపివేయాలని బ్యాంకును ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత స్టాక్ మార్కెట్లలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో కొనసాగిన పతనం మనందరం చూశాం. అలాగే బ్యాంక్ ఉన్నత నాయకత్వంలో కీలక వ్యక్తి రాజీనామా సైతం ఇటీవల జరిగింది.


ఆర్బీఐ లేవనెత్తిన అంశాలపై ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకర్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే కోటక్ మహీంద్రా బ్యాంక్ దాదాపు 400 మంది ఇంజనీర్లను ఈ ఏడాది నియమించుకోవాలని నిర్ణయించిందని సమాచారం. బ్యాంక్ టెక్నాలజీ సిస్టమ్స్‌లో ఆర్బీఐ గుర్తించిన లోపాల తర్వాత ఈ చర్య వస్తోంది. దీనికి ముందు గతవారం బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ కోటక్ బ్యాంకులో లోపభూఇష్టమైన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఖాళీల కారణంగా ఖాతాదారులను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేసుకోవద్దని, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. 



ఆర్బీఐ తీసుకున్న చర్యలు కోటక్ బ్యాంక్ పేరు ప్రఖ్యాతలను భారీగా ప్రభావితం చేసింది. అయినప్పటికీ దాని ఆర్థిక ప్రభావం తక్కువగా ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ వాస్వానీ ముంబైలో మీడియా సమావేశంలో చెప్పారు. తాము బలంగా తిరిగి మార్కెట్లోకి వచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, అది తమ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. నష్టనివారణ చర్యలను ప్రారంభించిన బ్యాంక్ ఐటీ సమస్యలను పరిష్కరించేందుకు వనరులు, డబ్బును ఎక్కువగా వెచ్చిస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ మొత్తం వ్యయంలో 10% ఐటిపై ఖర్చు చేస్తోంది. ఐటీ సిస్టమ్స్‌కు ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌ను నియమించేందుకు కోటక్ ఇప్పటికే ఆర్బీఐతో కలిసి పనిచేస్తోందని వెల్లడించారు. 



బ్యాంకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిలింద్ నగ్నూర్ ప్రకారం గత రెండేళ్లలో 500 మందికి పైగా ఇంజనీర్లను నియమించుకుందని వెల్లడైంది. వీరిలో ఎక్కువ మంది అమెజాన్, గూగుల్ కంపెనీలో పనిచేసిన అనుభవం కలిగినవారేనని వెల్లడైంది. నాలుగో త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 26 శాతం పెరిగింది. మే 8న మార్కెట్లు ముగిసే సమయానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు స్వల్పంగా 0.27 శాతం పెరిగి రూ.1,648.35 వద్ద ట్రేడింగ్ ముగించింది. 


Also Read: వడ్డీ లేకుండా 3 లక్షల అప్పు- సగం చెల్లించాల్సిన పని లేదు- ఇలాంటి ఆఫర్ ఒకటి ఉందని తెలిస్తే వ్యాపారాలు చేయడానికి షటర్లు దొరకవు!