Post Office Savings Account: పోస్ట్‌ ఆఫీసులో డబ్బును డిపాజిట్ చేయడం, లావాదేవీలు నిర్వహించడాన్ని సురక్షిత మార్గంగా పరిగణిస్తారు. మన దేశంలో కోట్లాది ప్రజల నమ్మకం పోస్ట్‌ ఆఫీసులు. ముఖ్యంగా, చిన్న మొత్తాల పొదుపు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేసి పోస్ట్ ఆఫీసే. బ్యాంక్‌ శాఖలు లేని ప్రాంతాల్లోనూ తపాలా కార్యాలయాలు పని చేస్తుంటాయి. అందుకే, బ్యాంక్‌ల వద్ద కంటే పోస్ట్‌ ఆఫీసుల్లోనే పొదుపు ఖాతాల సంఖ్య ఎక్కువ. 


చిన్న మొత్తాల పొదుపు పథకం కింద, పోస్ట్‌ ఆఫీసులు/ ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (India Post Payments Bank - IPPB) ప్రజలకు అనేక పెట్టుబడి ఎంపికలను అందిస్తున్నాయి. వాటిలో, సీనియర్ సిటిజన్ల దగ్గర నుంచి చిన్న పిల్లల కోసం వరకు బోలెడన్ని పథకాలు ఉన్నాయి. భారత పౌరులు ఎవరైనా ఈ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాల కింద భారత పౌరులు అందరికీ సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తారు.


ఇప్పుడు, ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ప్రీమియం సేవింగ్స్‌ అకౌంట్‌ (Premium Saving Account) అందుబాటులోకి వచ్చింది. దీని కింద ఖాతాదారులకు ఎక్కువ సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. క్యాష్‌ బ్యాక్, రుణం, డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ వంటి చాలా సదుపాయాలు ఖాతాదారులకు అందుతాయి. ఈ ఖాతాను ఎలా తెరవాలో, దాని ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చో ఈ కథనంలో మాట్లాడుకుందాం.


ప్రీమియం సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలు
పోస్‌ ఆఫీస్‌ ప్రీమియం సేవింగ్స్ ఖాతాలో ఇమిడి ఉన్న ప్రధాన విషయం ఏమిటంటే, అపరిమిత డబ్బునుర డిపాజిట్‌ చేయవచ్చు & విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో, బ్యాంకుల తరహాలోనే ఈ ఖాతా కింద డోర్‌ స్టెప్ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఖాతా కింద రుణం కూడా తీసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ లోన్ పేరిట అప్పు ఇస్తారు. అదేవిధంగా, మీరు ఈ ఖాతా నుంచి ఏ విధమైన బిల్లులు చెల్లించినా క్యాష్‌ బ్యాక్ వస్తుంది. క్యాష్‌ బ్యాక్‌ రూపంలో నిర్దిష్ట మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలో క్రెడిట్‌ చేస్తారు. దీంతో పాటు, భౌతిక & వర్చువల్ డెబిట్ కార్డ్‌ (Virtual Debit Card) కూడా జారీ చేస్తారు. ఈ ఖాతాకు కనీస నగదు నిల్వ (Minimum cash balance) పరిమితి లేదు. 


ప్రీమియం సేవింగ్స్ ఖాతా ఎవరి కోసం?
10 సంవత్సరాల వయస్సు దాటిన వారంతా ఈ ఖాతాను తెరవడానికి అర్హులే. అయితే, దీని కోసం KYC (Know Your Customer) పూర్తి చేయడం తప్పనిసరి. KYC చేయకపోతే పోస్ట్ ఆఫీస్ ప్రీమియం సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని పొందలేరు. 
ఈ ఖాతాను ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌ చేయడం కుదరదు. పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా, లేదా గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ ద్వారా మీరు ఈ ఖాతాను తెరవవచ్చు.


ఖాతా తెరవడానికి ఎంత ఖర్చవుతుంది?
పోస్ట్‌ ఆఫీస్‌ ప్రీమియం ఖాతాను తెరవాలంటే, మొదట  మీరు రూ. 149తో పాటు GST చెల్లించాలి. తర్వాత ఖాతాలో ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌ కోసం రూ. 200 చెల్లించాలి. మినిమమ్‌ క్యాష్‌ బ్యాలెన్స్‌ పరిమితి లేదు కాబట్టి, ఈ రూ. 200ను తర్వాత మీకు అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే, ఏటా ఖాతా పునరుద్ధరణ కోసం జీఎస్టీతో పాటు రూ. 99 వార్షిక చెల్లింపు చేయాలి.