Jeff Bezos, Elon Musk: అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో, గత మంగళవారంను (13 సెప్టెంబర్‌ 2022) అత్యంత నష్ట దినంగా చెప్పుకోవాలి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా డోజోన్స్‌ 1300 పాయింట్లు, S&P 500 4 శాతం పైగా; నాస్‌డాక్ 5 శాతం కంటే ఎక్కువ దిగజారాయి. అమెరికాలో ఆగస్టు నెల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదు కావడం స్టాక్‌ మార్కెట్లలో అడ్డకోతకు కారణం. ఈ ప్రభావంతో జపాన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఈక్విటీ ఫ్యూచర్లు భారీగా క్షీణించాయి. ఆ రోజు ఇండియన్‌ ఈక్విటీస్‌ కూడా భారీ గ్యాప్‌డౌన్‌లో ఓపెన్‌ అయినా, మరింత నష్టపోకుండా నిలదొక్కుకోగలిగాయి.


ఇక అసలు విషయానికి వస్తే.. మంగళవారం అమెరికన్‌ మార్కెట్లు ప్రపంచ కుబేరులకు కూడా భారీ షాక్‌ ఇచ్చాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కేవలం ఒక్క రోజులో $9.8 బిలియన్లు (దాదాపు ₹80,000 కోట్లు) కోల్పోయారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడయిన ఎలాన్ మస్క్ సంపద $8.35 బిలియన్లు (దాదాపు ₹70,000 కోట్లు) పడిపోయింది. కేవలం వీళ్లిద్దరి సొమ్మే ఒక్క రోజులో ₹1.50 లక్షల కోట్లు కనిపించకుండా పోయింది.


బోల్తా కొట్టిన బిలియనీర్స్‌
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... టాప్-10 జాబితాలో ఉన్న బిలియనీర్లు ఒక్క రోజులో బోల్డంత సంపదను కోల్పోయారు. ఈ జాబితాలో ఉన్న మార్క్‌ జుకర్‌బర్గ్‌, లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌, స్టీవ్‌ బామర్‌ డబ్బు 4 బిలియన్‌ డాలర్లకు పైగా ఆవిరైంది. స్టాక్‌ మార్కెట్‌ వీరుడు వారెన్‌ బఫెట్‌ 3.4 బిలియన్‌ డాలర్లను కోల్పోగా, బిల్‌ గేట్స్‌ 2.8 డాలర్లు నష్టపోయారు.


యూఎస్‌ కన్‌జంప్షన్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ జులై నుంచి ఆగస్టులో 0.1 శాతం పెరిగింది, గతేడాదితో పోలిస్తే 8.3% పెరిగింది. వాస్తవానికి ఇది కొద్దిగా తగ్గుదలే అయినా, అంచనా వేసిన 8.1% కంటే ఎక్కువ నంబర్‌ వచ్చింది. అందుకే అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు దీనిని నెగెటివ్‌గా తీసుకున్నాయి.


అంబానీ & అదానీ
విచిత్రం ఏమిటంటే, టాప్‌-10 లిస్టులో ఉన్న బిలియనీర్లలో, డబ్బు పోగొట్టుకోనిది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్‌ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ మాత్రమే. దీపావళి నాటికి 5G సేవలను ప్రారంభించబోతున్న అంబానీ $1.23 బిలియన్లు (₹9,775 కోట్లు) సంపాదించారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ 1.58 బిలియన్ డాలర్లు (₹12,556 కోట్లు) సంపాదించారు. మంగళవారం నాటి అత్యంత కఠిన పరిస్థితిలోనూ మన స్టాక్‌ మార్కెట్లు నిలదొక్కుకోవడం అంబానీ, అదానీకి కలిసి వచ్చింది.


జూలైలో బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, 2022 ప్రథమార్ధంలో (జనవరి - జూన్‌) బెజోస్ $63 బిలియన్లు నష్టపోగా, మస్క్ దాదాపు $62 బిలియన్లను పోగొట్టుకున్నారు. ఈ కాలంలో, ప్రపంచంలోని టాప్‌- 500 సంపన్నులు $1.4 ట్రిలియన్లు కోల్పోయారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.