Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR 2024) ఫైల్‌ చేసేందుకు చివరి తేదీ దగ్గర పడుతోంది. ఆ గడువు 31 జులై 2024తో ముగుస్తుంది. ఆదాయ పన్ను చట్టం కింద వర్తించే టాక్స్‌ ఆడిట్ లేదా ఇతర చట్టం ప్రకారం వర్తించే ఆడిట్ ఉంటే, ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి గడువు తేదీ 31 అక్టోబర్ 2024. ఒకవేళ, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ ఆడిట్ మీకు వర్తిస్తే, రిటర్న్‌ దాఖలు చేయడానికి గడువు తేదీ 30 నవంబర్ 2024.


గడువులోగా ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే ఏం జరుగుతుంది?


కొన్ని నష్టాలను తదుపరి సంవత్సరాలకు రోల్‌-ఔట్‌ చేయడం సాధ్యం కాదు. 


గడువు తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేస్తే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 234F కింద రూ. 5,000 ఫైన్‌ విధిస్తారు. మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే ఆలస్య రుసుము రూ. 1,000 మించదు. 


సెక్షన్ 80AC ప్రకారం, కొన్ని రకాల ఆదాయాలకు సంబంధించి తగ్గింపులు క్లెయిమ్‌ చేయడం కుదరదు.


వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదార్లు కొత్త పన్ను విధానం నుంచి మారలేరు.


ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ ఫైల్ చేయకపోతే జైలుకు పంపుతారా?


ఔను. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 276CC ప్రకారం, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన ఆదాయ పన్ను పత్రాలు సమర్పించకపోతే అతను శిక్షార్హుడు.


పన్ను మొత్తం రూ. 25,00,000 కంటే ఎక్కువవుంటే, ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష + జరిమానా విధిస్తారు.


ఇతర సందర్భంలో, 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.


ఆలస్యంగానైనా రిటర్న్‌ను డిసెంబర్ 31, 2024 లోపు లేదా ITR-U సెక్షన్ 139(8A)లో ఇచ్చిన సమయం కంటే ముందు ఫైల్ చేస్తే ఈ నిబంధన వర్తించదు.


ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ ఎవరికి తప్పనిసరి?


ఆదాయ పన్ను చట్టంలోని 80C, 80D వంటి సెక్షన్ల పరిధిలోని తగ్గింపులు తీసేయకముందు ఒక వ్యక్తి స్థూల ఆదాయం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి'కి  మించి ఉంటే అతను తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి.


ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాల్లో వార్షిక డిపాజిట్ రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి.


ఒక ఆర్థిక సంవత్సరంలో వృత్తి ద్వారా వచ్చిన ఆదాయం రూ. 10 లక్షలు దాటితే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి.


ఒక వ్యక్తి పేరిట వచ్చిన విద్యుత్ బిల్లులు సంవత్సరానికి రూ. 1 లక్ష దాటితే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి.


TDS/TCS రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ. 50,000. 


విదేశంలో ఆస్తి కలిగి ఉన్న వ్యక్తులు, విదేశంలో ఏదైనా ఖాతాలో సంతకం చేసే అధికారం కలిగిన వ్యక్తులు తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి.


ఒక ఆర్థిక సంవత్సరంంలో తన కోసం లేదా ఇతరుల కోసం అంతర్జాతీయ ప్రయాణాల కోసం రూ. 2 లక్షలకు మించి ఖర్చు చేస్తే  ITR ఫైల్ చేయాలి.


ఒక వ్యక్తికి సొంతంగా ఒక కంపెనీ లేదా భాగస్వామ్య సంస్థ ఉంటే తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్‌ ఫైల్ చేయాలి.


మరో ఆసక్తిర కథనం: పదేళ్లలో ఆదాయ పన్ను ఇన్ని రకాలుగా మారిందా? - తెలిస్తే ఆశ్చర్యపోతారు