Infosys Variable Pay: 


దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) గుడ్‌న్యూస్‌ చెప్పింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సగటున 80 శాతం వేరియబుల్‌ పే ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ నెల వేతనంతో పాటు ఈ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో వేయనుందని తెలిసింది.


'తొలి త్రైమాసికంలో మేం బాగానే రాణించాం. భవిష్యత్తులో విస్తరణకు పునాదులు వేసుకున్నాం. డిజిటల్‌ జర్నీ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు సేవలు అందించడంలో కట్టుబడ్డాం. వారి అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తాం. మా ప్రాధాన్యాలపై దృష్టి సారిస్తూనే అన్ని బృందాలతో సమన్వయంతో ఉంటున్నాం. మారుతున్న పరిస్థితులకు అలవాటు పడుతున్నాం. రాబోయే త్రైమాసికాల్లోనూ మరింత ఉత్పాదక సాధిస్తామన్న నమ్మకం ఉంది' అని ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు ఈమెయిల్‌ పంపించింది.


2024 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ సగటున 80 శాతం వేరియబుల్‌ పేమెంట్‌ ఇస్తోంది. ఉద్యోగుల ప్రదర్శన, కాంట్రిబ్యూషన్‌ను బట్టి వ్యక్తిగత వేరియబుల్‌ పేమెంట్‌ పర్సంటేజీ మాత్రం మారుతుంది. ఈ సమాచారాన్ని ఈ వారమే కంపెనీ ఉద్యోగులకు పంపించింది. అయితే 2023 ఆర్థిక ఏడాదిలో కంపెనీ వార్షిక పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. గత పెంపును 2022 జులైలో అమలు చేసింది. కాగా ఇంక్రిమెంట్ల అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని కంపెనీ సీఎఫ్‌వో నిలంజన్‌ రాయ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.


దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ ఏప్రిల్‌లోనే వార్షిక పెంపు చేపట్టింది. అద్భుత పనితీరు కనబరిచిన వారికి 12-15 శాతం మేర వేతనాలు పెంచింది. ఉద్యోగుల్లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్‌ పేమెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. మిగిలిన వారికి ఆ విభాగం పనితీరును బట్టి చెల్లిస్తామని తెలిపింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ దాదాపుగా 11 శాతం మేర నికర లాభం నమోదు చేసింది. అయితే విశ్లేషకుల అంచనాలను అందుకోలేదు. పైగా రెవెన్యూ గ్రోత్‌ ఔట్‌లుక్‌ను కత్తిరించింది. క్లెయింట్లు వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, ఖర్చులు తగ్గించుకోవడమే ఇందుకు కారణాలని వివరించింది.


ఇన్ఫోసిస్‌ 2024 క్యూ1లో వార్షిక ప్రాతిపదికన రూ.5,945 కోట్ల నికర లాభం నమోదు చేసింది. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే వార్షిక ప్రాదిపదికన 10 శాతం వృద్ధితో రూ.37,933 కోట్ల ఆదాయం ఆర్జించింది.


అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిలో ఉండటంతో 2024 ఆర్థిక ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను ఇన్ఫోసిస్‌ కత్తిరించింది. కాన్‌స్టాంట్‌ కరెన్సీ విధానంలో గతంలో 4-7 శాతంగా ఉన్న ఆదాయం వృద్ధిరేటును 1-3.5 శాతానికి తగ్గించింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ గైడెన్స్‌ను మాత్రం అందిపుచ్చుకుంది.


వార్షిక ప్రాతిపదికన ఇన్ఫోసిస్‌ ఆదాయం బాగున్నప్పటికీ చివరి త్రైమాసికంతో పోలిస్తే సాధారణంగానే ఉంది. అమ్మకాల్లో వృద్ధిరేటు 1.3 శాతమే ఉంది. ఇక నికర ఆదాయం మూడు శాతం మేర తగ్గింది. కాన్‌స్టాంట్‌ కరెన్సీ విధానంలో అయితే ఆదాయం కేవలం ఒక శాతమే పెరిగింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 20 బేసిస్‌ పాయింట్లు తగ్గి 20.8 శాతానికి చేరుకుంది.


Also Read: కొత్త పన్ను విధానానికి ఫుల్‌ పాపులారిటీ, ఐదున్నర కోట్ల మంది ఛాయిస్‌ ఇది!