Upcoming IPOs in 2023: ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్లలో (IPOs) పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారా?. ఈ సంవత్సరం (2023) 11 మేజర్ IPOలు మీ ముందుకు రాబోతున్నాయి. వీటి కోసం చాలా నెలలుగా, కొన్నింటి కోసం సంవత్సరాల తరబడి ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఇవి అటు ప్రైమరీ మార్కెట్‌లో, ఇటు సెకండరీ మార్కెట్‌లో సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. వీటిలో.. టాటా ప్లే, ఓయో రూమ్స్, ఓలా, స్విగ్గీ, బైజూస్, బోట్, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, ఇక్సిగో, గో ఫస్ట్, మామఎర్త్‌ ఉన్నాయి.


మార్కెట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 11 కంపెనీల IPOల వివరాలు:


టాటా ప్లే (Tata Play)
టాటా గ్రూపునకు చెందిన టాటా టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ టాటా ప్లే. రూ. 2500 కోట్ల సైజ్‌ IPOకు సన్నాహాలు చేస్తోంది. ఇది DTH సేవను అందిస్తుంది. ఇంతకు ముందు ఈ కంపెనీ పేరు టాటా స్కై. 


గోఫస్ట్‌ (Go First)
దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్, తన IPOతో వస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 3600 కోట్లు సమీకరించాలని ఈ ఎయిర్‌లైన్స్ యోచిస్తోంది. పాత GoAir కంపెనీయే ప్రస్తుత Go First. ఈ విమానయాన సంస్థకు 57 విమానాలు ఉన్నాయి. కంపెనీ ఆదాయం పెరిగినా, ఇంధన ధరలు పెరగడంతో నష్టం కూడా పెరిగింది.


మామఎర్త్‌ (MAMAEARTH)
సౌందర్యం, సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ కూడా ఈ ఏడాది రావచ్చు. గత 3 సంవత్సరాలలో కంపెనీ ఆదాయం 105 శాతం CAGR వద్ద పెరిగింది. 2022లో కంపెనీ లాభాలను ఆర్జించింది. భారతదేశంతో పాటు, ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాల్లో వ్యాపారం ఉంది.


ఓయో రూమ్స్‌ (OYO Rooms)
హోటళ్లలో రూమ్ బుకింగ్ సౌకర్యాలు కల్పిస్తున్న ఓయో రూమ్స్, ఈ ఏడాది తొలి నెలల్లోనే ఐపీఓకు రానుంది. కంపెనీకి ప్రస్తుతం 1,57,000 హోటళ్లు ఉన్నాయి. 35 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. IPO సంబంధిత పత్రాలను, అంటే DRHPని 2021లోనే SEBIకి అందించింది. 2022 సంవత్సరంలో IPOకు రావాలని ప్లాన్ చేసింది. మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఐపీవోకి వచ్చే సాహసం చేయలేదు.


స్విగ్గీ ‍‌(Swiggy)
ఫుడ్ డెలివరీ యాప్ Swiggy కూడా Zomato లాగా ఈ సంవత్సరం IPOకి రావచ్చు. దేశంలోని 500 పైగా నగరాల్లో ఈ కంపెనీ వ్యాపారం నడుస్తోంది. స్విగ్గీకి అనుబంధంగా 1.50 లక్షల రెస్టారెంట్లు ఉన్నాయి.


ఇక్సిగో (Ixigo )
ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ Ixigo మాతృ సంస్థ Le Travenues Technology Ltd, రూ. 1600 కోట్ల IPO కోసం డిసెంబర్ 2021లో  SEBI అనుమతిని తీసుకుంది. అయితే, ఆ సమయంలో తన IPOను మార్కెట్ చేయలేకపోయింది. ఈ సంవత్సరం IPO లాంచ్‌ అవుతుందని ఆశించవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ ‍‌(Flipkart)
అతి పెద్ద IPOల్లో ఒకటిగా నిలుస్తుందన్న అంచనాల మధ్య, ఈ-కామర్స్ దిగ్గజం Flipkart పేరు తెరపైకి వచ్చింది. భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఏప్రిల్ 2022న, IPO వాల్యుయేషన్ టార్గెట్‌ను $50 బిలియన్లుగా నిర్ణయించింది. ఈ కంపెనీ ఈ ఏడాది IPOకు రావచ్చు.


మొబిక్విక్‌ (Mobikwik)
Fintech కంపెనీ MobiKwik, IPO నుంచి రూ. 1,500 కోట్లను సమీకరించే ప్రణాళికలను గత సంవత్సరమే వెల్లడించింది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు లిస్టింగ్‌కు వెళ్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫిన్‌టెక్ సంస్థ ఈ ఏడాది IPOను ప్రారంభించే అవకాశం ఉంది.


బోట్‌ (boAt)
ఆడియో ఫోకస్డ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్, రూ. 2000 కోట్ల IPO గురించి గత ఏడాది మాట్లాడింది. తన IPO ప్రణాళికలను గత ఏడాది అక్టోబర్‌లో వాయిదా వేసింది. వ్యాపార విస్తరణను పెంచుకోవడానికి వార్‌బర్గ్ పింక్స్, కొత్త ఇన్వెస్టర్ మలబార్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి రూ.500 కోట్లను సమీకరించబోతోంది. ఈ కంపెనీ ఈ ఏడాది IPOను తీసుకురాగలదు.


బైజూస్‌ (BYJU'S)
విద్యా రంగంలో పనిచేస్తున్న బైజూస్‌, గత సంవత్సరం నుంచి IPO పైప్‌లైన్‌లో ఉంది. 2022 మేలో, ప్రి-ఐపిఓ రౌండ్‌లో భాగంగా $800 మిలియన్లను సేకరించింది. రాబోయే కొన్ని నెలల్లో IPO పత్రాలను దాఖలు చేయబోతోంది. దాదాపు 40 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.


ఓలా క్యాబ్స్‌ (Ola Cabs)
2022 మొదటి అర్ధభాగంలో ఈ IPO లాంచ్‌ అవుతుందని భావించారు, కానీ అది జరగలేదు. Ola CEO భవిష్ అగర్వాల్ ఇంతకుముందు చాలాసార్లు IPO గురించి మాట్లాడారు. Ola IPO ఈ సంవత్సరం మార్కెట్లోకి రావచ్చు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.