Rainbow Childrens Medicare tanks 17 percent closes at Rs 450 in debut trade : రెయిన్‌ బో చిల్డ్రన్‌ మెడికేర్‌ (Rainbow Childrens Medicare) ఐపీవో ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. ఆశించిన రీతిలో స్టాక్‌ మార్కెట్లో నమోదు కాలేదు. లిస్టింగే 7 శాతం డిస్కౌంట్‌తో మొదలైంది. తొలిరోజు ముగిసే సరికి షేరు ధర ఏకంగా 17 శాతం నష్టపోయింది.


ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు నెల రోజులుగా ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. వారం రోజుల నుంచి ఒలటిలిటీ మరీ ఎక్కువగా ఉంది. బెంచ్‌ మార్క్‌ సూచీలు ఏకంగా 5 శాతం వరకు నష్టపోయాయి. ఈ ప్రభావం ఐపీవోల పైనా పడుతోంది. కోరుకున్న రీతిలో షేర్లు లిస్టవ్వడం లేదు.


రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ షేర్లు ఉదయం రూ.506 వద్ద నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.542తో పోలిస్తే 6.6 శాతం డిస్కౌంట్‌తో లిస్టైంది. ఇక రోజంతా ప్రెజర్‌లోనే కనిపించింది. మార్కెట్లు ముగిసే సమయానికి 17 శాతం నష్టంతో రూ.450 వద్ద స్థిరపడింది. వాస్తవంగా రూ.421 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో 1.73 కోట్ల ఈక్విటీ షేర్లు, బీఎస్‌ఈలో 9.19 లక్షల షేర్ల వాల్యూమ్‌ ట్రేడ్‌ అయింది.


'మార్కెట్‌ సెంటిమెంట్‌ నెగెటివ్‌గా ఉండటం, సూచీలు ఒడుదొడుకులకు లోనవ్వడం రెయిన్‌బో లిస్టింగ్‌పై ప్రభావం చూపించాయి. హాస్పిటల్‌ బిజినెస్‌లపై ఇన్వెస్టర్లు అంత ఆసక్తి చూపించడం లేదు' అని స్వస్తికా రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా అన్నారు. 'హాస్పిటల్‌ వ్యాపారం చాలా పోటీతో కూడుకున్నది. కొవిడ్‌ తర్వాత సుదీర్ఘ కాలం వేచివుండే అగ్రెసివ్‌ ఇన్వెస్టర్లకు మాత్రమే ఇవి నప్పుతాయి' అని ఆయన పేర్కొన్నారు.


రెయిన్‌ బో చిల్డ్రన్‌ హాస్పిటల్స్‌ వ్యాపారం హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్పెషాలిటీ పీడియాట్రిక్‌, అబ్‌స్టెట్రిక్స్‌, గైనకాలజీలో సేవలు అందిస్తోంది. మేనేజ్‌మెంట్‌కు ఎంతో అనుభవం ఉంది. మంచి పేరు ఉండటంతో ప్రజలు నమ్మకం ఉంచుతున్నారు. మెడికల్‌ ప్రొఫెషనల్స్‌కు ట్రైనింగ్‌ ఇవ్వడంలోనూ ఈ హాస్పిటల్‌ చైన్‌కు మంచి అనుభవం ఉంది. డిసెంబర్‌ 2021 నాటికి 14 ఆస్పత్రులు, 1500 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇష్యూ ద్వారా రూ.1581 కోట్లు సమీకరించారు. అందులో ఫ్రెష్‌ ఇష్యూ రూ.280, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.1301 కోట్లు సమీకరించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.