Netweb Technologies Listing: ప్రస్తుత ఐపీవో మార్కెట్‌ విన్నింగ్‌ రన్‌ను నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్లు కంటిన్యూ చేశాయి. ఈ మధ్య కాలంలో లిస్టయిన కంపెనీల స్ఫూర్తితో, నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్లు కూడా బంపర్‌ ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి. ఇవాళ (గురువారం, 27 జులై 2023) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో 89% పైగా స్ట్రాంగ్‌ ప్రీమియంతో ఈ షేర్లు దలాల్‌ స్ట్రీట్‌లోకి అడుగు పెట్టాయి. 


వంద రూపాయల పెట్టుబడికి 89 రూపాయల లాభం
నెట్‌వెబ్ టెక్నాలజీస్ స్టాక్ నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో (NSE)‌ రూ.947 వద్ద లిస్ట్‌ అయింది. IPO ఇష్యూ ప్రైస్‌ రూ.500తో పోలిస్తే ఇది 89.4% ప్రీమియం. అదే సమయంలో, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో (BSE) ఒక్కో షేర్‌ రూ.942.5 ధర వద్ద అరంగేట్రం చేసింది. ఇది కూడా 88.5% లిస్టింగ్‌ గెయిన్‌.


లిస్టింగ్‌కు ముందు, ఈ కంపెనీ షేర్లు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో (గ్రే మార్కెట్‌) రూ.390 ప్రీమియంతో చేతులు మారాయి.


ఆఫర్‌ సమయంలో, నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఐపీవోకు అతి భారీ స్పందన వచ్చింది, 90.36 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే... ఈ కంపెనీ 100 షేర్లు ఇవ్వడానికి బిడ్స్‌ పిలిచిందని భావిస్తే, 9,000 షేర్లు కావాలంటూ బిడ్స్‌ వచ్చాయి.


అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుర్ల (qualified institutional buyers) భాగం 228.91 రెట్లతో భారీగా సబ్‌స్క్రైబ్ అయింది. 81.81 రెట్లుతో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (non-institutional investors) ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల (retail investors) కేటగిరీ 19.15 రెట్లు సభ్యత్వం పొందింది.


IPO ద్వారా రూ. 206 కోట్ల విలువైన ఫ్రెష్‌ ఈక్విటీ షేర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు, ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు 8.5 మిలియన్ల ఈక్విటీ షేర్లను 'ఆఫర్ ఫర్ సేల్'లో (OFS) తీసుకొచ్చారు. IPOకు ముందు ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 189 కోట్లు సమీకరించింది.


ఐపీవోలో, ఒక్కో షేరును ₹475 - ₹500 రేంజ్‌లో నెట్‌వెబ్ టెక్నాలజీస్ అమ్మింది. ప్రైస్ బ్యాండ్ అప్పర్‌ ఎండ్‌ (₹500) ప్రకారం, FY23 ఆదాయాల ఆధారంగా, 55 రెట్ల P/Eతో IPOకు వచ్చింది.


కంపెనీ వ్యాపారం, లాభనష్టాలు
దేశంలో ఉన్న కొన్ని OEMల్లో (original equipment manufacturer) నెట్‌వెబ్ టెక్నాలజీస్‌ ఒకటి. ప్రముఖ హై-ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ (HCS) ప్రొవైడర్. IT హార్డ్‌వేర్, టెలికాం, నెట్‌వర్కింగ్ ప్రొడక్ట్స్‌ తయారీలో PLI స్కీమ్‌ కింద ఉంది. కంప్యూటింగ్, స్టోరేజ్ టెక్నాలజీలను ఈ కంపెనీ డెవలప్‌ చేస్తోంది. వ్యాపారాలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థల గణన అవసరాలను తీర్చడానికి సూపర్‌ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. 


ఇప్పటివరకు, ఈ కంపెనీ తయారు చేసిన మూడు సూపర్ కంప్యూటర్లు ప్రపంచంలోని టాప్-500 సూపర్ కంప్యూటర్ల లిస్ట్‌లోకి 11 సార్లు ఎక్కాయి.


FY23లో, కంపెనీ ఆదాయం 80% పెరిగి రూ. 445 కోట్లకు చేరుకుంది. నికర లాభం ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి దాదాపు రూ.47 కోట్లు మిగిలింది. 


మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial