Multibagger Stock: 2022లో మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మహా మహా స్టాక్స్ మట్టి కరిచాయి. పెద్దగా పేరు లేని స్క్రిప్స్ మల్టీబ్యాగర్లుగా మారి పెట్టుబడిదారులకు అనేక రెట్ల రాబడిని అందించాయి. మల్టీ బ్యాగర్లుగా మారిన వాటిలో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన మూడు నెలల్లోనే అరివీర భయంకరంగా పెరిగిందో చిన్న కంపెనీ స్టాక్.
రాకెట్‌ను మించిన స్పీడ్
పెట్టుబడిదారులకు ఊహించనంత (నిజంగానే వాళ్లు ఊహించనంత) భారీ రాబడిని అందించిందో స్మాల్ క్యాప్ స్టాక్. ఆ స్క్రిప్ పేరు వరేనియం క్లౌడ్ లిమిటెడ్ (Varanium Cloud Ltd). దీని పనితీరు గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే, శ్రీహరికోట రాకెట్ కూడా ఈ స్టాక్ స్పీడ్ ముందు దిగదుడుపే.
80 రోజుల్లోనే లక్షకు ఏడు లక్షల లాభం
ఈ ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన వరేనియం క్లౌడ్ IPO స్టార్టయింది, 20వ తేదీన ముగిసింది. ఒక్కో షేరుకు రూ. 122 ఇష్యూ ప్రైస్‌తో IPO పూర్తయింది. అదే నెల 27వ తారీఖున స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది.
ఇది చిన్న కంపెనీ కావడంతో ఈ IPO SME కేటగిరీ కిందకు వెళ్లింది. అంటే, ఈ షేర్లను 1, 2, 13, 30 ఇలా మనకు నచ్చిన నంబర్‌లో కొనడం, అమ్మడం జరగదు. లాట్‌లోనే కొనాలి, లాట్‌లోనే అమ్మాలి. ఒక్కో లాట్‌కు వెయ్యి షేర్లు ఉంటాయి.
2022 సెప్టెంబర్ 16న రూ. 122 ఇష్యూ ప్రైస్‌తో వచ్చిన ఈ షేరు... 2022 డిసెంబర్ 16న రూ. 987.80 వద్ద ట్రేడయింది. మీరు ఆశ్చర్యపోయినా, ఇదే వాస్తవం. లిస్టింగ్ నుంచి ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను కొడుతూనే ఉంది. నెల క్రితం షేరు రూ. 427 వద్ద ట్రేడవుతోంది. కేవలం ఒక నెలలో, పెట్టుబడిదారులు 131 శాతం రాబడిని పొందారు. లిస్టయిన ఈ 3 నెలల్లోనే తన ఇన్వెస్టర్లకు 710 శాతం (7 రెట్లకు పైగా) రాబడిని ఇచ్చింది. ఒక్కో షేరు మీద ఇన్వెస్టర్లు రూ. 865.8 లాభాన్ని ప్రస్తుతం కళ్లజూస్తున్నారు.
లిస్టింగ్ సమయంలో మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు మీకు రూ. 7 లక్షల 10 వేల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు లెక్క. ఒక్కో షేరుకు రూ. 122 చొప్పున, వెయ్యి షేర్లు ఉన్న ఒక్కో లాట్ కోసం రూ. 1,22,000 పెట్టుబడి పెట్టినట్లయితే, ఆ పెట్టుబడి నేడు రూ. 9,87,800కి పెరిగింది. రూ. 8,65,800 లాభం కళ్ల ముందు ప్రత్యక్షమైంది.
వరేనియం క్లౌడ్ వ్యాపారం
వరేనియం క్లౌడ్ లిమిటెడ్ 2017లో ప్రారంభమైంది. డిజిటల్ ఆడియో, వీడియో, ఫైనాన్షియల్ బ్లాక్‌చెయిన్ ఆధారిత స్ట్రీమింగ్ సర్వీసులను ఈ కంపెనీ అందిస్తుంది. వ్యాపార వృద్ధి కారణంగా కంపెనీ ఆదాయం, లాభం భారీగా పెంచుకంటూ వెళ్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.