IPL Media Rights Auction Apple, Netflix And Facebook Likely To Compete For Rs 50,000 Crore Bid : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు (IPL) ప్రసార హక్కులకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ప్రసార హక్కులను దక్కించుకొనేందుకు పోటీ పడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), ఆపిల్‌ (Apple) సైతం బిడ్డింగ్‌కు ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొన్ని ప్రసార సంస్థలు బిడ్డింగ్‌ పత్రాలు తీసుకున్నాయి.


వచ్చే ఐదేళ్లకు ఐపీఎల్‌ను ప్రసారం చేసేందుకు బీసీసీఐ (bcci) బిడ్డింగ్‌కు ఆహ్వానిస్తోంది. మీడియా హక్కులను విక్రయించడం ద్వారా బీసీసీఐకి దాదాపుగా రూ.50,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. బిడ్డింగ్‌ వేయాలంటే ముందుకు ఆయా సంస్థలు రూ.25 లక్షలు పెట్టి ముందుగా ఐటీటీ పత్రాలు కొనుగోలు చేయాలి. ఐపీఎల్‌లో జట్లు, మ్యాచులు పెరగడంతో ఈ సారి ఎక్కువ మంది పోటీపడతారని అంచనా.


ఈ ఏడాదితో స్టార్‌ హక్కులు ముగిసిపోతాయి. దాంతో 2023 -27 సైకిల్‌కు బీసీసీఐ బిడ్డింగ్స్‌ ఆహ్వానించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, టీవీ 18 వయాకామ్‌, అమెజాన్‌, జీ, సోనీ హక్కుల పత్రాలను కొనుగోలు చేశాయని తెలిసింది. ఈ ఐదుగురు చాలా సీరియస్‌గా హక్కుల కోసం ట్రై చేస్తున్నాయి. వీరికి పోటీగా ఫేస్‌బుక్‌ (Face book), ఆపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌ వస్తున్నాయని తెలుస్తోంది. వచ్చే వారం వీరు ఐటీటీ పత్రాలు కొనుగోలు చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐటీటీ పత్రాలు కొనుగోలు చేసేందుకు మే 10 చివరి తేదీ. జూ 12న ఈ-వేలం ఉంటుందని తెలుస్తోంది.


చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్‌ ఐపీఎల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అన్ని విభాగాలకు కలిపి కాంపోజిట్‌ బిడ్డింగ్‌ వేసింది. అయితే ఈ సారి బీసీసీఐ కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్‌ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్‌ సబ్‌కాంటినెట్‌ డిజిటల్‌ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్‌ నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్‌, 4 ప్లేఆఫ్‌ మ్యాచులు, 13 ఈవినింగ్‌ డబుల్‌ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఆవల ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.