Foxconn Bengalore : తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ (Foxconn) బెంగళూరు శివారులో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతున్న ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. ఈ సంస్థ ప్లాంట్ ను ఇండియాలో పెట్టాలని అనుకుంది. యాపిల్ కూడా మేడిన్ ఇండియా యాపిల్ ఫోన్లను భారీగా తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఫాక్స్ కాన్ అనేక రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. చివరికి కర్ణాటకలో 300 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా ప్రకటించింది. దీని కోసం అనుబంధ సంస్థ 'ఫాక్స్‌కాన్ హాన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్' దాదాపు రూ.300 కోట్లు చెల్లించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటకలోనే ఐ ఫోన్లు తయారవుతాయన్న సీఎం బొమ్మై
కర్ణాటకలో యాపిల్ తమ ఐఫోన్లను తయారు చేయనుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మార్చిలో ప్రకటించారు. దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అయితే ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సమావేశమయ్యారు. మార్చి రెండో తేదీన ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 24వ తేదీన కొంగర కలాన్ వద్ద 250 ఎకరాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది.
హైదరాబాద్‌లో కొంగరకలాన్ వద్ద ల్యాండ్ కొంటామన్న ఫాక్స్ కాన్
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని అనుకున్నట్లుగా ఫాక్స్ కాన్ ప్రకటించింది. కానీ ఆ కొనుగోలు ప్రక్రియపై ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయాలనుకున్న ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ చాంగ్ యి ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ . కానీ ఇంకా ఎలాంటి భూ లావాదేవీలు చేయలేదని తెలుస్తోంది.
ఇప్పుడు హైదరాబాద్‌లో ప్లాంట్ ఉన్నట్లా ? లేనట్లా ?
హఠాత్తుగా కర్ణాటకలో బెంగళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో దేవనహళ్లి దగ్గర మూడు వంద ఎకరాలు అనుబంధ సంస్థ ద్వారా కొనగోలు చేసినట్లుగా లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు ఫాక్స్ కాన్ తెలిపింది. బెంగళూరులో ల్యాండ్ కొనుగోలు చేసిన అనుబంధ కంపెనీ పేరు ఫాక్స్ కాన్ హాన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ కంపెనీ ఈ స్థలం కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లో ల్యాండ్ కొనాలనుకున్న ఫాక్స్ కాన్ అనుబంధ సంస్థ, బెంగళూరులో ల్యాండ్ కొన్న అనుబంధ సంస్థ రెండూ వేర్వేరు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ తీసుకుంటారా లేదా.. ప్లాంట్ పెడతారా లేదా అన్నది కంపెనీనే ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికి బెంగళూరులో ఫాక్స్ కాన్ ల్యాండ్ కొన్నట్లు స్పష్టం కావడంతో.. అక్కడే యాపిల్ తయారీ యూనిట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.