Infosys CEO Salil Parekh: ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (Information Technology) రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. గూగుల్‌ నుంచి గల్లీ కంపెనీ వరకు, ప్రతి టెక్నాలజీ సంస్థలోని సిబ్బందిని ఉద్యోగ భయం వెంటాడుతోంది. ఈ ఉద్వాసనల్లో తమ వంతు కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో కూడా ఐటీ సంక్షోభ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద ప్రాజెక్టులు లేక & ఆదాయం రాక, టెక్నాలజీ కంపెనీలు విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ తొలగింపుల వల్ల ఉద్యోగులే కాదు, ఐటీ రంగం కూడా బాగా నష్టపోయింది. 


ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏకు మేకై కూర్చున్నట్లు, ఐటీ వాళ్లు సృష్టించిన కృత్రిమ మేధ చివరికి వాళ్ల ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఏఐ వల్ల తమ జాబ్స్‌కు గ్యారెంటీ లేదన్న గట్టి అభిప్రాయం ఇండియా సహా ప్రపంచ దేశాల ఐటియన్లలో కనిపిస్తోంది. ప్రపంచ కుబేరుడు & టెస్లా CEO ఎలాన్‌ మస్క్‌ ‍‌(Elon Musk on AI Technology) కూడా ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు రావని, అన్ని పనులను AI చేసి పెడుతుందని చెప్పారు. ఉద్యోగం అనేది ఆప్షనల్‌గా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ వల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని మస్క్‌ కామెంట్‌ చేశారు.


చల్లటి కబురు చెప్పిన ఇన్ఫోసిస్‌
ఏఐ భయంతో ఐటీ సిబ్బంది ఇబ్బంది పడుతుంటే, మన దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) మాత్రం చల్లటి కబురు చెప్పింది. తన సిబ్బందికి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించింది. ఇన్సిస్‌లో ఎలాంటి రిట్రెంచ్‌మెంట్ ఉండదని సీఈవో సలిల్ పరేఖ్ (Infosys CEO Salil Parekh) చెప్పారు, ఉద్యోగాల విషయంలో కంపెనీ వైఖరిని స్పష్టం చేశారు.


"ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీలు AIని స్వీకరించి, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తొలగించాయి. AI కారణంగా మా ఉద్యోగుల్లో ఎవరినీ తీసేయము. ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీలు ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. అలాంటివి మేము చేయకూడదన్న స్పష్టమైన ఆలోచనతో ఉన్నాం" - ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సలిల్‌ పరేఖ్‌


సాంకేతికత అభివృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టి
పెద్ద కంపెనీల్లో ఒకేసారి చాలా రకాల టెక్నాలజీలకు సంబంధించిన పనులు చేయవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో నియామకాలు, శిక్షణ ద్వారా జనరిక్ AIలో నైపుణ్యాల వృద్ధిని ఇన్ఫోసిస్‌ కొనసాగిస్తుందని వెల్లడించారు. దీనివల్ల, ప్రపంచ కంపెనీల అన్ని రకాల డిమాండ్లను తీర్చగల సామర్థ్యాన్ని ఇన్ఫోసిస్‌ కలిగి ఉంటుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఉద్యోగాల తొలగింపునకు బదులు కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఆర్థిక వాతావరణం మెరుగవుతున్న డిజిటల్ సాంకేతికత కోసం వివిధ పరిశ్రమలు చేస్తున్న ఖర్చులు పెరుగుతుండడం చూస్తున్నాం, దీనివల్ల నియామకాలు కూడా మెరుగవుతున్నాయని వివరించారు. ప్రస్తుతానికి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకోలేదని సలీల్ పరేఖ్ చెప్పారు. అయితే ఇన్ఫోసిస్‌లో నియామకాలు కొనసాగడం ఖాయమని స్పష్టం చేశారు. 


ఇన్ఫోసిస్, ఇటీవల తన ఉద్యోగులకు పనితీరు బోనస్‌ (Variable Pay) జారీ చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే, జనవరి-మార్చి త్రైమాసికంలో సగటు చెల్లింపు 60 శాతానికి తగ్గింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది 73 శాతంగా ఉంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి