India Q1 GDP: భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ సూపర్ ఫాస్ట్‌ వేగం అందుకుంది. ఈ ఏడాదిలో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం నుంచి అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, కమోడిటీ ధరలు తగ్గడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగవ్వడంతో దేశ జీడీపీ భారీగా పెరిగింది.


ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌ రెండంకెల వృద్ధిరేటు 13.5 శాతం నమోదు చేసింది. రాయిటర్స్‌, ఇతర సంస్థలు అంచనా వేసిన 15.2 శాతం కన్నా కొద్దిగా తగ్గింది. అయితే చివరి త్రైమాసికంలోని 4.1% వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగైంది.


ప్రైవేటు వినియోగం పెరగడం జీడీపీ వృద్ధిరేటు పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొవిడ్‌1-19 భయాలు తగ్గిపోవడంతో తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ జోరు పెరిగింది. అంతకు ముందు డెల్టా వేవ్‌తో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్లు అమలు చేయడం, ఆంక్షలు విధించడంతో డిమాండ్‌, వినియోగం తగ్గిన సంగతి తెలిసిందే.


గత ఆర్థిక ఏడాదిత తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం వృద్ధిరేటుతో పయనించింది. అయితే కొవిడ్‌-19 మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ 23.8 శాతం కుంచించుకుపోవడంతో వృద్ధిరేటు తగ్గిపోయింది. లాక్‌డౌన్లతో వ్యాపారాలు మూసివేయడానికి తోడు లక్షల మందికి ఉపాధి కరవైంది. భారత్‌తో పోలిస్తే చైనా వృద్ధిరేటు మరింత కుంచించుకుపోయింది. జీరో కొవిడ్‌ పాలసీతో అక్కడి తయారీ కర్మాగారాలు మూతపడటమే ఇందుకు కారణం.


భారత తయారీ రంగం 4.8 శాతం, నిర్మాణ రంగం 16.8 శాతం రేటుతో వృద్ధి చెందుతున్నాయని కేంద్ర గణాంక శాఖ బుధవారం వెల్లడించింది. ప్రైవేటు వినియోగం ఏకంగా 26 శాతానికి పెరిగిందని తెలిపింది. 'స్థిర (2011-12) ధరలతో పోలిస్తే 2022-23 తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ రూ.36.85 లక్షల కోట్లకు చేరుకుంది. 2021-22లో ఇది రూ.32.46 లక్షల కోట్లు. ఇదే సమయంలోని 20.1 శాతంతో పోలిస్తే 13.5 శాతం వృద్ధిరేటు నమోదైంది' అని ప్రభుత్వం తెలిపింది. కాగా తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటును ఆర్బీఐ 16.2 శాతం, ఏడాదికి 7.2 శాతంగా అంచనా వేయడం గమనార్హం.


వ్యాక్సినేషన్‌ విస్తృతి, కీలక రంగాల్లో పురోగతితో భారత వృద్ధిరేటు 13 శాతంగా ఉంటుందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా (ICRA) అంచనా వేసింది. వినియోగం, సేవలు, పెట్టుబడి రంగాల్లో వృద్ధి పెరిగిందని తెలిపింది. ప్రైవేటు వినియోగం 16 శాతం, స్థూల స్థిర మూలధన ఫార్మేషన్‌ 14 శాతంగా అంచనా వేసింది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఎగుమతులు తగ్గుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎకానమీకి మద్దతు దొరికిందని వెల్లడించింది.