Foreign Exchange Reserves in India in 2023: దేశంలో వరుసగా రెండో వారంనూ విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. 2023 నవంబర్ 24తో వారంలో ఫారిన్‌ కరెన్సీ రిజర్వ్‌లు 2.53 బిలియన్‌ డాలర్లు పెరిగాయి, 600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా గణాంకాలను వెల్లడించింది.


ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం... నవంబర్ 24, 2023 నాటికి, భారత్‌లో విదేశీ మారక నిల్వలు 2.538 బిలియన్ డాలర్లు పెరిగి 597.395 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో (నవంబర్ 17తో ముగిసిన వారంలో) ఫారెక్స్ రిజర్వ్స్‌ 5.07 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీని కంటే ముందు, నవంబర్ 10వ తేదీతో ముగిసిన వారంలో ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్‌ 462 మిలియన్ డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.


2023 నవంబర్ 24వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) కూడా భారీగా పెరిగాయి. ఆ వారంలో ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ 2.14 బిలియన్‌ డాలర్ల వృద్ధితో మొత్తం 528.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 


మరోమారు పెరిగిన పసిడి ఖజానా
2023 నవంబర్ 24తో వారంలో ఆర్‌బీఐ దగ్గర బంగారం నిల్వలు (Gold reserves In India) కూడా పెరిగాయి. ఆర్‌బీఐ పసిడి ఖజానా 296 మిలియన్ డాలర్ల జంప్‌తో 46.33 బిలియన్ డాలర్లకు చేరింది. SDRs (Special Drawing Rights) 87 మిలియన్ డాలర్లు పెరిగి 18.21 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌లో (IMF) రిజర్వ్‌ పొజిషన్ కూడా పెరిగింది.  IMFలో ఇండియా డిపాజిట్ చేసిన నిల్వలు 14 మిలియన్ డాలర్లు జంప్‌ చేసి 4.84 బిలియన్ డాలర్లకు పెరిగాయి.


గత రెండు వారాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 7.50 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లోకి ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) పెట్టుబడులు పెరగడం దీనికి కారణం.


భారతదేశంలో మొత్తం విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌లో జీవితకాల గరిష్ట స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


రూపాయి విలువ (Indian Rupee Value)
అయితే, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం ఆర్‌బీఐ ఆందోళనను మరింత పెంచింది. గత గురువారం, అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.40 వద్ద ముగిసింది, ఇది చరిత్రాత్మక కనిష్ట స్థాయి. శుక్రవారం (డిసెంబర్ 1, 2023) నాడు, రూపాయి విలువ 11 పైసలు బలపడి ఒక డాలర్‌కు 83.29 స్థాయి వద్ద ముగిసింది. 


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గి బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయికి చేరుకోవడం ఆర్‌బీఐకి ఊరటనిచ్చే అంశం. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కరెన్సీ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే రూపాయి ఎంత బలహీనపడితే దిగుమతుల కోసం అంత ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు