Union Budget 2025-26: ఏటా, ఫిబ్రవరి 01వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో సమర్పిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కూడా, కేంద్ర ఆదాయ-వ్యయాల పద్దులను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) 2025 ఫిబ్రవరి 01న పార్లమెంట్‌ ముందు ఉంచుతారు. అయితే, ఆ రోజు శనివారం. సాధారణంగా, శనివారం & ఆదివారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు. మరి, కీలకమైన కేంద్ర పద్దును సమర్పించే శనివారం రోజున  భారతీయ స్టాక్ మార్కెట్లకు యథావిధిగా సెలవు ఇస్తారా, లేదా లావాదేవీలు నిర్వహిస్తారా అన్నది ఇప్పుడు మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌లో ఉన్న సందేహం.


కేంద్ర బడ్జెట్‌, స్టాక్ మార్కెట్‌ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. కేంద్ర కేటాయింపులు పెరిగిన రంగాల్లోని కంపెనీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయి, కేటాయింపులు తగ్గిన రంగాల్లోని కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కు వస్తాయి. పైగా, శనివారం తర్వాత ఆదివారం కూడా స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బడ్జెట్‌ ప్రకటించిన తర్వాత వరుసగా రెండు రోజులు సెలవులు వస్తే, మార్కెట్‌ ఒడుదొడుకులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే అవకాశం లేక చిన్న మదుపుదార్లు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


ఫిబ్రవరి 01న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌?
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం రోజున స్టాక్ మార్కెట్‌ను తెరిచి ఉంచాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ వంటి కీలకమైన రోజున స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి పెట్టుబడిదారులకు అవకాశం ఇవ్వాలని, ఆరోజున స్పెషల్‌ ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించాలని బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE), నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (NSE) ఆలోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా, స్టాక్‌ మార్కెట్లపై బడ్జెట్ ప్రకటనల ప్రభావాన్ని పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకునే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


స్టాక్‌ మార్కెట్‌ సమయంపైనా మల్లగుల్లాలు
ఫిబ్రవరి 01న స్టాక్‌ మార్కెట్‌ను ఓపెన్‌ చేస్తారా, సెలవును కొనసాగిస్తారా అనే విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. స్టాక్‌ ఎక్సేంజ్‌లు BSE & NSE, బడ్జెట్ రోజున మార్కెట్‌ను తెరవడం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటాయి. ఒకవేళ, బడ్జెట్ డే ఫిబ్రవరి 01 శనివారం నాడు స్టాక్ మార్కెట్ తెరవాలని నిర్ణయిస్తే, సాధారణ సమయం ప్రకారమే లావాదేవీలు జరగవచ్చు. అంటే, స్టాక్ మార్కెట్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం 3.30 గంటల వరకు పని చేస్తుంది. ఇది కాకుండా, ప్రి-ఓపెనింగ్ సెషన్ కూడా సాధారణ రోజుల్లో జరిగే విధంగా ఉదయం 9.00 గంటల నుంచి 9.15 వరకు ఉంటుంది.


గతంలోనూ శనివారం నాడు నిర్వహణ
గతంలోనూ, శనివారం సెలవును రద్దు చేసి స్టాక్ మార్కెట్లను నిర్వహించారు. 2020 సంవత్సరంలో, బడ్జెట్‌ డే అయిన ఫిబ్రవరి 01వ తేదీ శనివారం నాడు వచ్చింది. ఆ రోజున భారతీయ స్టాక్‌ మార్కెట్లను సాధారణ సమయాల ప్రకారమే నిర్వహించారు. దీనికిముందు, 28 ఫిబ్రవరి 2015న, శనివారం నాడు బడ్జెట్ సమర్పణ రోజు కావడంతో, ఆ రోజున కూడా స్టాక్ మార్కెట్లు తెరిచి ఉన్నాయి. గతంలో, ఫిబ్రవరి నెలలో చివరి రోజున బడ్జెట్‌ ప్రవేశపెట్టేవాళ్లు. బడ్జెట్‌ ప్రకటనలకు అనుగుణంగా కొత్త ఆర్థిక సంవత్సరానికి సిద్ధం కావడానికి, సర్దుబాట్లు చేసుకోవడానికి సమయం సరిపోవకపోవడంతో, ఇప్పుడు ఫిబ్రవరి నెల తొలిరోజున బడ్జెట్‌ సమర్పిస్తున్నారు. తద్వారా, బడ్జెట్‌ ప్రకటనలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవడానికి రెండు నెలల (ఫిబ్రవరి, మార్చి) సమయం ఉంటోంది.


మరో ఆసక్తికర కథనం: ఈ 4 క్రిస్మస్‌ గిఫ్ట్‌లతో మీరు వెరీ స్మార్ట్‌ అని నిరూపించుకోవచ్చు - రేటు రూ.2 వేల కంటే తక్కువే!