Railway Rules For General Ticket: మన దేశంలో, ప్రతి రోజూ కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇండియన్‌ రైళ్లలో ఒక రోజులో ప్రయాణించేవాళ్ల సంఖ్య ఆస్ట్రేలియా జనాభాకు సమానమని ఒక అంచనా. ప్రయాణీకుల సంఖ్య పరంగా ఇండియన్‌ రైల్వేస్‌ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే వ్యవస్థ. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ట్రైన్‌లో వెళ్లడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. బస్‌ లేదా కార్‌తో పోలిస్తే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండడం, ఎక్కువ ఫెసిలిటీలు అందడమే దీనికి కారణం. రైలు ప్రయాణంలో సాటి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు, జర్నీల విషయంలో రైల్వే డిపార్ట్‌మెంట్‌ కొన్ని రూల్స్‌ పెట్టింది.


ట్రైన్‌ టిక్కెట్ల విషయంలోనూ ప్రయాణీకులు ఓ రూల్‌ ఫాలో కావాలి. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే, ప్రజలు అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా సీట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు, లేకపోతే జనరల్ టిక్కెట్లు తీసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒకవేళ జనరల్ టికెట్ తీసుకుంటే, ఎన్ని గంటల లోపు రైలును క్యాచ్‌ చేయాలి, ఆ టిక్కెట్‌ వ్యాలిడిటీ ఎన్ని గంటలు అన్న డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా?


3 గంటల్లోగా ప్రయాణం
జనరల్‌ టిక్కెట్‌కు కాలపరిమితి (validity of train general ticket) ఉంటుంది, ఆ టైమ్‌ తర్వాత అది చెల్లదు. ఏ వ్యక్తయినా దిల్లీ లేదా ముంబై వంటి మెట్రో నగరాల్లో జనరల్ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే, దాని వాలిడిటీ కేవలం 1 గంట మాత్రమే. అంటే, 1 గంటలోపు అతను రైలు ఎక్కి ఆ స్టేషన్‌ నుంచి బయలు దేరాలి. చిన్న నగరాల్లో ఈ రూల్‌ మారుతుంది. చిన్న నగరాల్లో, ఎవరైనా జనరల్‌ టిక్కెట్‌ కొని 199 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాల్సి వస్తే, టిక్కెట్‌ కొన్న 3 గంటల లోపు ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఈ రూల్‌ ప్రకారం, నిర్ణీత గడువు దాటిన తర్వాత టిక్కెట్‌ను రద్దు చేయడం కుదరదు, ప్రయాణం కూడా చేయలేరు. ఎందుకంటే 3 గంటల తర్వాత మీ టికెట్ చెల్లుబాటు కాదు. ఇంతకుముందు, చాలా మంది తమ జనరల్ టిక్కెట్లను ఇతరులకు విక్రయించేవారు. ఇలాంటి మోసాలను నియంత్రించేందుకు రైల్వేశాఖ ఈ నియమం తీసుకొచ్చింది. ప్రయాణ దూరం 200 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, జనరల్ టికెట్‌ను 3 రోజుల ముందుగానే తీసుకోవచ్చు.


జనరల్‌ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌ కూడా కొనచ్చు
కొంతకాలం క్రితం వరకు, ప్రయాణికులు జనరల్‌ ట్రైన్‌ టిక్కెట్లను క్యూలో నిలబడి కొనాల్సి వచ్చేది. రైల్వే అధీకృత టికెట్ కౌంటర్లలో మాత్రమే టిక్కెట్లు అందుబాటులో ఉండేవి. కొన్నిసార్లు, చాంతాడంత క్యూలో మన వంతు వచ్చి టిక్కెట్‌ కొనేలోపే ట్రైన్‌ ఆ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయేది కూడా. ఇప్పుడా ఇబ్బంది లేదు. జనరల్‌ టిక్కెట్లు కొనడానికి కూడా ఆన్‌లైన్ ఫెసిలిటీ కల్పించింది. ఇప్పుడు, అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెటింగ్‌ సిస్టమ్‌ (UTS) యాప్ ద్వారా జనరల్‌ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కొన్న టిక్కెట్లకు కూడా వ్యాలిడిటీ రూల్స్‌ వర్తిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: ఇంత కరువులో ఉన్నారేంట్రా, వాటి కోసమూ లోన్‌ తీసుకుంటున్నారు!