Train Journey: భారతీయ రైల్వే, తన ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను, సదుపాయాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని సులభంగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ప్రయాణ సమయంలో సదుపాయాలు కల్పించడం, ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకుంటే నగదు వాపసు చేయడం వరకు ప్రతి విషయాన్ని రైల్వే శాఖ సులభతరం చేసింది. 


ఇదే తరహాలో మరో కొత్త సౌకర్యాన్ని కూడా రైల్వే శాఖ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. జనరల్ టిక్కెట్‌ మీద రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు స్లీపర్ క్లాస్‌ బోగీల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని రైల్వే శాఖ ప్రస్తుతం పరిశీలిస్తోంది. దీని మీద డివిజనల్ అడ్మినిస్ట్రేషన్స్‌ నుంచి రైల్వే బోర్డు ఒక నివేదిక అడిగింది.


ప్రస్తుతం దేశంలో చలి వణికిస్తోంది. దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్ర ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీలు నమోదవుతున్నాయి, నీళ్లు కూడా గడ్డ కడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చేసే రైలు ప్రయాణం చాలా ఇబ్బందులతో కూడినది. దీంతో, చలికాలంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ ఆలోచిస్తోంది. రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చాక, జనరల్‌ టిక్కెట్‌ ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లలో ప్రయాణం చేయవచ్చు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధులకు, పేదలకు ఉపయోగపడుతుంది. 


ఏసీ కోచ్‌ల సంఖ్య పెంపు
చలి తీవ్రత కారణంగా, రైలు ప్రయాణీకుల సంఖ్య తీవ్రంగా ప్రభావితమైంది. చలికాలంలో, రైలులో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు ఏసీ కోచ్‌లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. బయటి నుంచి చలిగాలులు లోపలకు రాకుండా బోగీ మొత్తం పూర్తిగా మూసేసి ఉండడం దీనికి ప్రధాన కారణం. దీంతో, ఏసీ కోచ్‌ల టిక్కెట్లకు డిమాండ్‌ పెరిగింది. గిరాకీ నేపథ్యంలో, కొన్ని రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. కొన్ని రైళ్లలో AC కోచ్‌ల టిక్కెట్‌ ధర, స్లీపర్ కోచ్‌ టిక్కెట్‌ ధరకు దాదాపు సమానంగా ఉంటుంది, పెద్దగా తేడా ఉండదు. దీంతో, ఎక్కువ మంది ప్రయాణికులు ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తుున్నారు, స్లీపర్‌ కోచ్‌లలో సీట్లు ఖాళీ అవుతున్నాయి.


సాధారణ బోగీలుగా స్లీపర్‌ కోచ్‌లు
మీడియా కథనాల ప్రకారం, స్లీపర్ కోచ్‌ల సీట్లు చాలా వరకు ఖాళీగా ఉన్న రైళ్లను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఆ స్లీపర్ కోచ్‌లలో కొన్నింటిని సాధారణ కోచ్‌లుగా మార్చే ఆలోచనలో ఉంది. ఈ కోచ్‌ల మీద అన్‌-రిజర్వ్‌డ్ అని రాసి ఉంటుంది. అయితే, ఈ కోచ్‌ల మధ్య తలుపులు మూసివేస్తారు. ఫలితంగా, ఎవరూ జనరల్ బోగీ నుంచి స్లీపర్ కోచ్‌లోకి వెళ్లలేరు.


అన్ని రైల్వే డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి రైల్వే శాఖ ఒక నివేదిక కోరింది. స్లీపర్ కోచ్‌లలో సీట్లు 80 శాతం వరకు ఖాళీగా నడుస్తున్న రైళ్ల వివరాలను రైల్వే బోర్డు కోరింది. ఈ రైళ్లన్నింటిలో ఖాళీగా ఉన్న స్లీపర్ కోచ్‌లను జనరల్‌గా మారుస్తారు.