Indian Economy: 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) తగ్గించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని మెచ్చుకుంది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  5.9 శాతం వృద్ధి
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇచ్చిన గత అంచనా‍‌ (2023 జనవరి) 6.1 శాతం. తాజాగా దానిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది, 5.9 శాతం వృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించింది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెలువరించిన అంచనా 6.5 శాతం కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా దాని చాలా తక్కువగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని చాలామంది ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నప్పటికీ IMF అంచనా తగ్గింది. 


తాజాగా విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్' నివేదికలో, వచ్చే ఆర్థిక సంవత్సరం, అంటే FY 2024-25 కాలంలోనూ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చని గత అంచనాలో పేర్కొనగా, ఇప్పుడు దానిలో 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టి, 6.3 శాతానికి తగ్గించింది. 


గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును 6.8 శాతంగా నమోదు కావచ్చని IMF అంచనా వేసింది. GDP వృద్ధి 7 శాతం ఉండవచ్చన్న కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనా కంటే ఇది తక్కువ.


ఆర్థిక పరిస్థితిపై ప్రశంసలు 
భారత ఆర్థిక వృద్ధి అంచనాల్లో కోత పెట్టినప్పటికీ, మన దేశ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రశంసలు కురిపించింది. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని మెచ్చుకుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలుస్తుందని పేర్కొంది. 


ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అంచనాలు
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుపై కూడా తన అంచనాలను IMF విడుదల చేసింది. 2023లో గ్లోబల్ ఎకానమీ 2.8 శాతం వృద్ధి చెందుతుందని వెల్లడించింది. అయితే.. గతంలో వేసిన అంచనా 2.9 శాతంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024లో 3 శాతం వృద్ధి చెందుతుందని లెక్కలు వెలువరించింది. ఇంతకుముందు వెలువరించిన అంచనా 3.1 శాతంగా ఉంది. గత (జనవరి) అంచనాలతో పోలిస్తే, ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 10 బేసిస్ పాయింట్ల చొప్పున IMF తగ్గించింది. 2022లో 3.4 శాతం వృద్ధి రేటు నమోదైంది.


అమెరికాలో బ్యాంకుల పతనం, స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్ సూయిస్‌కు UPS బెయిలౌట్ గురించి ఐఎంఎఫ్‌ ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తే ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది. కాబట్టి, 2023 ప్రారంభంలో అగ్రరాజ్య వృద్ధి సాఫీగా ఉండొచ్చని తాత్కాలిక సూచన చేసింది. 2023లో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన IMF, 2.8 శాతానికి పెరుగుతుందని, 2024లో వృద్ధి రేటు 3 శాతం ఉండవచ్చని అంచనా వేసింది.


మన పొరుగు దేశం, అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతున్న చైనాలో, 2023లో 5.2 శాతం ఆర్థిక వృద్ధి, 2024లో 4.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించింది. 2022లో డ్రాగన్‌ కంట్రీ 3 శాతం వృద్ధిని నమోదు చేసింది.