Indian economy:
ప్రపంచానికి భారత్ వెలుగు చుక్క అనేందుకు మరో ఉదాహరణ! ఈ రెండేళ్లలో ప్రపంచ అభివృద్ధిలో భారత్ 15 శాతం వరకు కంట్రిబ్యూట్ చేయబోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. ఎమర్జింగ్ మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా 80 శాతం ఉండబోతోందని వెల్లడించారు.
పటిష్ఠమైన ఆర్థిక ప్రదర్శనతో భారత్ వెలుగు చుక్కగా మారిందని క్రిస్టాలినా జార్జీవా అన్నారు. గ్లోబల్ గ్రోత్ ఇంజిన్‌గా మారిందన్నారు. అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా తయారైందన్నారు. 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితితో తల్లడిల్లుతున్న వేళ పటిష్ఠమైన భారత ప్రదర్శన చుక్కాని. ఈ వారం బెంగళూరులో 20 మంది ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల బృందం సమావేశం అయ్యేందుకు ఇది చక్కని వేదిక' అని ఆమె పేర్కొన్నారు.
భారత జీ20 అధ్యక్షతన కేంద్ర బ్యాంకుల డిప్యూటీలు బుధవారం రెండోసారి సమావేశం అయ్యారు. ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధినేతలు శుక్రవారం జత కలుస్తున్నారు. జీ20 సమావేశాల్లో వీరు పాల్గొనడం ఇదే తొలిసారి. సమావేశంలో ఎక్కువగా ఉక్రెయిన్ యుద్ధం, పరిణామాల గురించే చర్చిస్తారని తెలిసింది.
2023 సవాళ్లతో కూడిన మరో ఏడాదిగా మారుతోందని ఐఎంఎఫ్ ఆందోళన చెందుతోంది. ద్రవ్యోల్బణం తగ్గేందుకు, దిగువకు చేరిన వృద్ధి రేటు పైకి వచ్చేందుకు టర్నింగ్ పాయింట్ అవుతుందని అంచనా వేస్తోంది. 'ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి 2.9 శాతానికి నెమ్మదిస్తుందని మా అంచనా. 2024లో 3.1 శాతానికి పెరుగుతుందని ఆశిస్తున్నాం' అని జార్జీవా తెలిపారు. 21వ శతాబ్దంలో ప్రపంచ ఎదుర్కొంటున్న సమస్యలు, బహుళ దేశాల అభివృద్ధి బ్యాంకుల పటిష్ఠం, భవిష్యత్తు నగరాల నిర్మాణం, ఆర్థిక సమ్మిళత కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లివరేజీ పెంపొందించడంపై సమావేశంలో చర్చిస్తామన్నారు.
జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశాలు ఈ నెల 24, 25న నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారు. అప్పుల పునర్‌వ్యవస్థీకరణ గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. 'బెంగళూరులో ఈ వారం మేం వ్యక్తిగతంగా కలుస్తున్నాం. పబ్లిక్, ప్రైవేటు రుణదాతలు, రుణ గ్రహీత దేశాలు కలిసి పనిచేసేందుకు మార్గం సుగమం చేస్తాం. లోపాలను సరిచేసేందుకు ప్రయత్నిస్తాం' అని జార్జీవా పేర్కొన్నారు.