India Forex Reserves: భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఐదు నెలల గరిష్ట స్థాయికి 572 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది (2022) ఆగస్టు నెల ప్రారంభం నుంచి చూస్తే ఇదే అత్యధికం. 


2023 జనవరి 13వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ ద్రవ్య నిల్వలు 10.417 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. కొత్త ఏడాదిలో ఏ వారంలో అయినా ఇదే అతి పెద్ద పెరుగుదల. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం ఈ గణాంకాల బులెటిన్‌ విడుదల చేసింది. 


దీని కంటే ముందు వారంలో, అంటే, 2023 జనవరి 6వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు (foreign exchange reserves లేదా FOREX) 1.268 బిలియన్ డాలర్లు తగ్గి 561.583 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే, జనవరి 13వ తేదీతో ముగిసిన వారానికి, ఒక్క వారంలో, 10.417 బిలియన్ డాలర్లు పెరిగాయి.


జనవరి 20తో ముగిసిన ప్రస్తుత వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో వృద్ధి నెమ్మదిగా ఉన్నప్పటికీ, కొంత లాభం మాత్రం కనిపిస్తోంది.


ఉత్తమ ట్రేడింగ్‌ వీక్‌
రూపాయి ట్రేడింగ్‌ పరంగా... 2023 జనవరి 13తో ముగిసిన వారం, గత రెండు నెలల్లోనే అత్యుత్తమ ట్రేడింగ్ వీక్‌గా నిలిచింది. రూపాయి విలువ టైట్‌ రేంజ్‌ నుంచి బయటపడి, అక్కడి నుంచి పుంజుకుంది.


2021 సంవత్సరం అక్టోబర్‌ నెలలో మన దేశంలోని ఫారిన్‌ ఎక్సేంజ్‌ రిజర్వ్స్‌ ఆల్‌ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఆ నెలలో జీవనకాల గరిష్ట స్థాయి 645 బిలియన్‌ డాలర్లను టచ్‌ చేశాయి. అయితే, పడిపోతున్న రూపాయి విలువను నిలబెట్టేందుకు అప్పటి నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) అనేక చర్యలు తీసుకుంది. కుప్పలుతెప్పలుగా మూలుగుతున్న ఫారిన్‌ కరెన్సీని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి, ఒక్క ఏడాదిలోనే ఫారిన్‌ కరెన్సీ రిజర్వ్స్‌ వేగంగా క్షీణించాయి, సుమారు 120 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. 2022 అక్టోబర్‌ నెలలో రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.


అదే సమయంలో, 2021 అక్టోబర్ నెలలోని ఒక వారంలో రికార్డ్‌ స్థాయిలో 14.721 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు నమోదయ్యాయి. ఏ సంవత్సరంలోనైనా, ఒక వారంలో వచ్చిన గరిష్ట మొత్తం ఇదే.


పెరిగిన 'విదేశీ కరెన్సీ ఆస్తులు'
సెంట్రల్ బ్యాంక్ వారం వారీ డేటా ప్రకారం... మొత్తం కరెన్సీ నిల్వల్లో ముఖ్య భాగంగా పరిగణించే విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) సమీక్ష కాల వారంలో 9.078 బిలియన్‌ డాలర్లు పెరిగి 505.519 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్లలో సూచించే విదేశీ కరెన్సీ ఆస్తులయిన యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీల్లో విలువ, తరుగుదల ప్రభావాలను కూడా ఇందులో చేర్చారు.


IMFలో పెరిగిన దేశ కరెన్సీ నిల్వలు
2023 జనవరి 13వ తేదీతో ముగిసిన వారంలో, బంగారం నిల్వల విలువ 1.106 బిలియన్ డాలర్లు పెరిగి 42.89 బిలియన్ డాలర్లకు చేరుకుంది. RBI డేటా ప్రకారం.. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) 147 మిలియన్ డాలర్లు పెరిగి 18.364 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వారంలో, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద ఉన్న భారతదేశ కరెన్సీ నిల్వలు కూడా 86 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.227 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు అపెక్స్ బ్యాంక్ డేటా బట్టి అర్ధం అవుతోంది.