India Inflation: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వడ్డీ రేట్లను రేటును పెంచకుండా కాస్త ఉపశమనం ప్రకటించినప్పటికీ, గత ఏడాది మే నుంచి చూస్తే రెపో రేటును 2.5 శాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆ మాత్రం రేట్లు పెంచడంలో తప్పులేదు, తప్పలేదన్న ఆర్‌బీఐ వాదన. ఆర్‌బీఐ సంగతి ఎలా ఉన్నా... వదన్నా వినిపిస్తున్న ద్రవ్యోల్బణం ప్రభావం మాత్రం మామూలుగా లేదు. పెరిగిన ఇంటి ఖర్చులు, తగ్గిన పొదుపులను చూసి దేశంలోని 74 శాతం మంది ప్రజలు బావురుమంటున్నారు.
ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అనవసర ఖర్చులకు కళ్లెం వేస్తున్నారట జనం. డబ్బులు ఆదా చేయడానికి, పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకోవడానికి సగం కంటే ఎక్కువ మంది భారతీయులు రెస్టారెంట్ డిన్నర్లు, టూర్ ప్లాన్‌లను ప్రస్తుతానికి రద్దు చేసున్నారు. PwC గ్లోబల్ కన్స్యూమర్ ఇన్‌సైట్స్ పల్స్ (PwC Global Consumer Insights Pulse) చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. సర్వే నివేదిక ప్రకారం... ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు లేదా మొత్తం జనాభాలో 63 శాతం మంది ప్రజలు రాబోయే 6 నెలల పాటు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్లాన్స్ వేశారట.
రోజువారీ అవసరాలు కూడా తీరడం లేదు
దిల్లీ, ముంబై వంటి దేశంలోని 12 పెద్ద నగరాల్లో సర్వేను నిర్వహించి ఈ నివేదికను తయారు చేశారు. గత సంవత్సర కాలంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, సగానికి పైగా భారతీయుల రోజువారీ అవసరాలు కూడా తీరడం లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సర్వేలో తేలింది.
ఇంకా పచ్చిగా చెప్పుకుంటే... 47 శాతం ప్రజలు డిస్కౌంట్‌లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని, తెలుసుకుని అక్కడి వెళ్లి వస్తువులు కొనుగోలు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. 45 శాతం మంది ప్రజలు ప్రత్యేక ఆఫర్ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రీమియం ఫోన్‌ల వంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
అవసరం లేని కొనుగోళ్లలో కోత
32 శాతం మంది ప్రజలు వర్చువల్ ఆన్‌లైన్ యాక్టివిటీ నుంచి వైదొలగాలనుకుంటున్నారు. మరో 32 శాతం మంది వినియోగదార్లు ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లను కూడా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యాషన్ వస్తువులను తగ్గించాలని 31% మంది, దేశ పర్యాటకాన్ని వాయిదా వేయాలని 30% మంది కోరుకుంటున్నారు. అంతేకాదు, పెరిగిన వంటగ్యాస్ ధరలు భరించలేక, 21 శాతం మంది ప్రజలు తమకు గ్యాస్ వద్దని అనుకుంటున్నారు.
పర్యావరణ అనుకూల గృహోపకరణాలకు ప్రాధాన్యత
PwC గ్లోబల్ కన్స్యూమర్ ఇన్‌సైట్స్ సర్వే ప్రకారం... దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని 80 శాతం మంది కోరుకుంటున్నారు, దీని కోసం ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఆ ఉత్పత్తులు పర్యావరణ అనుకూలంగా ఉంటేనే కొంటామని చెప్పారు. రీసైకిల్ చేసిన ఉత్పత్తుల కోసం కూడా డబ్బు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారట.
1980 తొలి సంవత్సరాల్లో పుట్టిన వాళ్లు, 1997 తర్వాత పుట్టిన యువత రివెంజ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. కొవిడ్ సమయంలో ఎటూ కదల్లేకపోయారు కాబట్టి, దానికి ప్రతీకారంగా చేపట్టిన ప్రయాణ ప్రణాళికలో ఎలాంటి మార్పు చేయట్లేదని సర్వేలో చెప్పారు.