Income Tax: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, తన తాజా నిర్ణయంలో పన్ను చెల్లింపుదార్లకు పెద్ద ఊరటనిచ్చింది. సొంత ఇంటి బదులు అద్దె ఇంట్లో ఉంటూ, బిల్డర్ నుంచి అద్దె డబ్బులు పొందుతున్న పన్ను చెల్లింపుదార్లకు ఇది ఉపశమనం. బిల్డర్ నుంచి అందుకున్న అద్దె చెల్లింపు మొత్తం, ఆదాయపు పన్ను చట్టం కింద సంబంధిత పన్ను చెల్లింపుదారు ఆదాయంగా ఇకపై లెక్కలోకి రాదు.


సాధారణంగా, ఒక మంచి ప్రాంతంలో ఒక పాత భవనం ఉంటే దాని స్థానంలో కొత్త భవనం/అపార్ట్‌మెంట్‌ కట్టడానికి బిల్డర్లు సదరు భవనం యజమానితో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం, కట్టిన అపార్ట్‌మెంట్‌లో భవనం యజమాని-బిల్డర్‌ కొన్ని ఫ్లాట్లు/వాటా తీసుకుంటారు. ఇది రెండు పార్టీలకు లాభదాయకతమైన డీల్‌. ఇలాంటి సందర్భాల్లో, భవనం యజమాని ఆ ఇంటిని ఖాళీ చేసి, కొత్త నిర్మాణం పూర్తయ్యే వరకు వేరే ఇంట్లో అద్దెకు ఉండాల్సి వస్తుంది. ఇందుకు ప్రతిగా, బిల్డరే ఆ ఇంటి అద్దెను భరిస్తాడు. దీనిని కాంపెన్సేటరీ రెంటల్ (compensatory rental) అని పిలుస్తారు.


ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, అద్దె ఆదాయం అంటే అద్దె రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తారు. అటువంటప్పుడు, కాంపెన్సేటరీ రెంటల్‌ను కూడా అద్దె రూపంలో పొందిన ఆదాయంగా పరిగణించాలా, వద్దా అనే విషయంపై వివాదం ఉంది.


ఇన్‌కం టాక్స్‌ ట్రిబ్యునల్ నిర్ణయం ఏమిటి?
రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కారణంగా, ఒక బిల్డర్ నుంచి పరిహారంగా పొందిన అద్దెపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ముంబై బెంచ్ పేర్కొంది. ఒక భవనాన్ని పునర్నిర్మించే సమయంలో, ఒక భవనం యజమాని ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే, అందుకు పరిహారంగా అతను బిల్డర్‌ నుంచి పొందిన అద్దెపై పన్ను విధించకూడడదని ఇన్‌కం టాక్స్‌ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పరిహారపు అద్దె అనేది క్యాపిటల్ గెయిన్ అని, అది ఎలాంటి ఆదాయం కాదని, అందువల్ల ఫ్లాట్ యజమాని చేతిలోకి వచ్చిన డబ్బు పన్ను పరిధిలోకి రాదని ముంబై బెంచ్ పేర్కొంది.


అజయ్ పరస్మల్ కొఠారీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ముంబై బెంచ్, ఈ నిర్ణయం తీసుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి కంప్యూటర్ ఆధారిత పరిశీలనలో అతని ITR వచ్చింది, కొఠారీ, బిల్డర్ నుంచి అద్దె పరిహారం రూపంలో రూ. 3.7 లక్షలు పొందినట్లు పన్ను అధికారి గుర్తించారు. టాక్స్‌ అథారిటీ, ఆ మొత్తాన్ని ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం కింద, పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించింది. అంటే, అతను తన పన్ను స్లాబ్ ప్రకారం ఈ మొత్తానికి పన్ను చెల్లించాలని ఆదేశించింది. టాక్స్‌ అథారిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముందుగా కమిషనర్ (అప్పీల్స్), ఆ తరువాత ITATకి కొఠారి అప్పీల్ చేశారు.


లక్షలాది మందికి ఉపశమనం
పన్ను చెల్లింపుదారు తన తల్లిదండ్రులతో కలిసి నివసించినప్పటికీ, పునరాభివృద్ధి కోసం తన ఫ్లాట్‌ను ఖాళీ చేయడంలో అతను ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంలో, పరిహారం రూపంలో పొందిన అద్దెకు పన్ను విధించకూడదని తెలిపింది. మన దేశంలోని అనేక నగరాల్లో పెద్ద సంఖ్యలో పునరాభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నందున, లక్షలాది మందికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.