Stock Market News: స్టాక్‌ మార్కెట్‌ను కరోనాకు ముందు, కరోనా తర్వాత అంటూ విభజించి మాట్లాడుకోవచ్చు. కరోనా కాలంలో ఇంట్లోంచి బయటకు కదల్లేకపోయిన జనం, స్టాక్‌ మార్కెట్‌లోకి దిగారు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, దానిని మిగిలిన ప్రపంచానికి అనుసంధానించే వేగవంతమైన నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండేసరికి షేర్‌ మార్కెట్‌లో చెలరేగిపోయారు. కరోనాకు ముందు 4 కోట్ల కూడా దాటని డీమ్యాట్‌ ఖాతాలు, ఇటీవలే 10 కోట్ల మార్కును టచ్‌ చేశాయి. గత రెండున్నరేళ్లలోనే రెట్టింపు పైగా పెరిగాయి. స్టాక్‌ మార్కెట్‌ మీద గతంలో కంటే ఇప్పుడు అవగాహన పెరిగింది. 


ఇక్కడ, ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్టాక్‌ మార్కెట్‌లో లాభాలే కాదు నష్టాలు కూడా వస్తాయి. అన్నింటికీ సిద్ధపడే పెట్టుబడులు పెట్టాలి. మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంటే, కొన్ని విషయాల మీద కచ్చితమైన అవగాహనతో నష్టాల బారి నుంచి తప్పించుకుని లాభాలు కళ్లజూడవచ్చు. నిర్ణయం తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మీ కష్టార్జితం మార్కెట్‌ పాలవుతుందని గుర్తుంచుకోవాలి. ఈ క్రింది 5 అంశాలను మీరు తూ.చా.తప్పకుండా పాటిస్తే మాత్రం ఒక మల్టీబ్యాగర్‌ను సృష్టించే అవకాశం (అవకాశం మాత్రమే) ఉంది.


సమాచార సేకరణ
ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు, ఆ కంపెనీ వ్యాపార, ఆర్థిక అంశాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. సదరు కంపెనీ గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే తప్ప పెట్టుబడి పెట్టకూడదు. ఆ సంస్థపై విశ్వాసం రాకపోతే, మీ లిస్ట్‌ నుంచి దాని పేరు కొట్టేయండి. వ్యాపార నమూనా, చేసే వ్యాపారం రెండూ చక్కగా ఉన్న కంపెనీలోనే పెట్టుబడి పెట్టాలి. సంబంధింత రంగంలో ఆ కంపెనీ స్థానమేంటో కూడా చూసుకోవాలి.


హై రిటర్న్‌ - లో రిస్క్‌
వ్యాపార పరంగా, పెట్టుబడి పరంగా రిస్క్ తక్కువగా ఉండే కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టాలి. రాత్రికి రాత్రే లక్షలు రావాలని ఆశించకుండా, దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. హఠాత్తుగా భారీ లాభాలు లేదా భారీ నష్టాలు ఇచ్చే స్టాక్స్‌కు దూరంగా ఉండండి.


పెట్టుబడుల రూపంలోకి లాభాలు
ఇప్పటికే మీరు ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేసి అందులో మంచి లాభాన్ని ఆర్జిస్తే, దానిని అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఆ లాభాన్ని మళ్లీ పెట్టుబడిగా పెట్టాలి. వేరే స్టాక్‌నో, లేదా అదే స్టాక్‌కు సంబంధించి మరిన్ని షేర్లనో కొనాలి. ఇలా కొనసాగిస్తూనే వెళ్లాలి. ఇలా చేయడం ద్వారా "మ్యాజిక్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌" మీకు అర్ధమవుతుంది. దీర్ఘకాలంలో పెట్టుబడిపై అనేక రెట్లు రాబడిని పొందవచ్చు.


సొంత అవగాహన ముఖ్యం
ఎవరో టిప్‌ చెప్పారనో, పక్కవాళ్లు లాభపడుతున్నారనో స్టాక్‌ మార్కెట్‌లోకి దిగవద్దు. ఒకవేళ పక్కవాళ్లు చెప్పినా, దాని గురించి మీరు కూడా సొంతంగా పరిశోధన చేసిన తర్వాతే ఒక స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి. ఇలా చేస్తే, ఆ స్టాక్‌ ప్రైస్‌లో వచ్చే హెచ్చుతగ్గులు మిమ్మల్ని టెన్షన్‌ పెట్టవు.


అత్యాశ అసలే వద్దు
స్టాక్‌ మార్కెట్‌లో అస్సలు పనికిరానిది అత్యాశ. మీరు అత్యాశ పడితే మీ జేబుకు స్వయంగా మీరే చిల్లు పెట్టుకున్నట్లవుతుంది. మార్కెట్‌లో చాలా మంది పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందినా, దాంతో సంతృప్తి చెందరు. మరింత లాభం పొందాలన్న అత్యాశతో పొజిషన్‌ను కొనసాగిస్తుంటారు. ఒక్కోసారి మార్కెట్ పతనమైనప్పుడు వచ్చిన లాభాలూ పోతాయి, పెట్టుబడీ పోతుంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.