GST 2 Rate Cuts: ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల GST రేట్లను తగ్గించింది. దీనివల్ల చాలా ముఖ్యమైన, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గాయి. 12 శాతం, 28 శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్స్ రద్దు చేస్తూ సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ చాలా నివేదికలు ఏం చెబుతున్నాయంటే.. దుకాణదారులు, ఈ-కామర్స్ స్టోర్లు ఇప్పటికీ ఎన్నో వస్తువుల ధరలను తగ్గించలేదు. పన్ను తగ్గింపు, దుకాణదారులు వసూలు చేస్తున్న ధరల మధ్య వ్యత్యాసం ఉంటే వినియోగదారులకు GST తగ్గింపు ప్రయోజనం అందదు. పైగా కేంద్రం చెబుతున్న మాటలకు, ప్రజలకు ప్రయోజనంపై ఎక్కడా పొంతన ఉండదు.
హెల్ప్‌లైన్ నంబర్‌లు విడుదల చేసిన ప్రభుత్వం
జీఎస్టీ సంస్కరణల తరువాత దుకాణాలు, ఆన్‌లైన్ స్టోర్‌లపై ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. GST రేట్లను తగ్గించడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది. తద్వారా కొనుగోలుదారులకు అధిక ధరల నుంచి ఉపశమనం కలగనుంది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని భావిస్తే, సులభంగా ఫిర్యాదు చేయవచ్చని వినియోగదారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
ఎలా ఫిర్యాదు చేయాలి?
టోల్-ఫ్రీ నంబర్: 1915
WhatsApp నంబర్: 8800001915
ఆన్‌లైన్ పోర్టల్: INGRAM (ఇంటిగ్రేటెడ్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)
వినియోగదారులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)కి కాల్ చేయడం ద్వారా లేదా WhatsApp సందేశం పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సెంట్రల్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ బోర్డ్ (CBIC) స్పష్టం చేసింది.
GSTలో భారీ సంస్కరణలు
GST స్లాబ్‌లను సరళీకరించడానికి, ప్రభుత్వం 4 స్లాబ్‌లకు బదులుగా ఇప్పుడు కేవలం 2 స్లాబ్‌లను (5 శాతం, 18 శాతం) ఉంచాలని నిర్ణయించింది. ఈ సంస్కరణల కారణంగా రోజువారీ ఉపయోగించే 99 శాతం మేర వస్తువుల ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ధరల తగ్గింపుతో ప్రజలకు ప్రయోజనంపై నిరంతరం నిఘా ఉంచుతోందని, చాలా కంపెనీలు స్వయంగా ముందుకు వచ్చి ధరలను తగ్గిస్తున్నాయని పేర్కొంది. తద్వారా వినియోగదారులకు దీని ప్రయోజనం అందుతుంది. ఒకవేళ GST తగ్గింపు ప్రయోజనం అందకపోతే, దానిపై ఫిర్యాదు చేయడం మీ హక్కు అని వినియోగదారులకు ప్రభుత్వం సూచించింది.
రోజువారీ వినియోగించే వస్తువులు, ఉత్పత్తులపై 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. 5 శాతం ఉన్న జీఎస్టీని కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా తొలగించడం సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని రకాల కార్లు, బైకులపై సైతం 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో విక్రయాలు పెరుగుతున్నాయి. అందులోనూ నవరాత్రి సీజన్, ఫెస్టివల్ సేల్స్ సీజన్ కావడంతో మార్కెట్లకు కొత్త ఊపు రావడం ఖాయమని ఆర్థికశాఖ భావిస్తోంది.