Rent Payment Charges: భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, మారుమూల ప్రజలకు కూడా బ్యాంకింగ్‌ చేరువైంది. దీంతో పాటు, దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య అతి వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు, యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి అద్దె, హోటల్ బిల్లులు మొదలైన అన్ని రకాల పేమెంట్స్‌ కోసం క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నారు. 


కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, ఇప్పటికే ఉన్న కష్టమర్లు చేజారకుండా నిలుపుకోవడానికి క్రెడిట్ కార్డ్ కంపెనీలు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. కష్టమర్ల ద్వారా కార్డ్‌ వినియోగం ఫ్రీక్వెన్సీ, టోటల్‌ వాల్యూ పెంచుకోవడానికి వివిధ రకాల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, రివార్డ్‌ పాయింట్లు, ఓచర్లు వంటి తాయిలాలు అందిస్తున్నాయి. 


బిల్లుల చెల్లింపుల్లో భాగంగా... ఫోన్‌ పే (PhonePe), క్రెడ్‌ (CRED), పేజాప్‌ (Payzapp), పేటీఎం (Paytm), రెడ్‌ జిరాఫీ ‍‌(Red Giraffe) వంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌ల ద్వారా, మీ దగ్గరనున్న క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి సులభంగా ఇంటి అద్దె (Rent payment) చెల్లించవచ్చు.


అద్దె చెల్లిస్తే రుసుము
ఎస్‌బీఐ కార్డ్స్‌ (SBI Cards‌), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda - BoB), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), తమ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి చెల్లించే అద్దెపై ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో బ్యాంక్‌ ఎక్కింది. అది.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ (IDFC Fist Bank). క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు చేస్తే అదనపు ఛార్జీని విధించాలని నిర్ణయించింది. మీరు, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపు చేస్తే, చెల్లించిన అద్దె మీద 1% రుసుము (Fees) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వస్తు, సేవల పన్ను (GST) అదనం. ఈ నిబంధన మార్చి 3, 2023 నుంచి అమల్లోకి వస్తుంది.


ఇప్పటి వరకు, తన క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి అద్దె చెల్లింపు చేస్తే, ఆ లావాదేవీ మీద ఎలాంటి ఛార్జీని IDFC ఫస్ట్ బ్యాంక్ వసూలు చేయలేదు. ఈ కారణంగా, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు Paytm, PhonePe, No Broker, PayZap, Red Giraffe మొదలైన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అద్దెను చెల్లించగలిగారు. అయితే, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్లాట్‌ఫామ్‌లు అన్నింటిలో, మీ నుంచి ఖచ్చితంగా స్పెషల్‌ కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తారు.


క్రెడిట్‌ కార్డ్ ద్వారా చేసే అద్దె చెల్లింపు మీద అదనపు బాదుడును బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది.


ఎస్‌బీఐ కార్డ్స్‌ కూడా, 2022 నవంబర్‌ 15వ తేదీ నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది. SBI Card క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేస్తే, ప్రాసెసింగ్‌ ఫీజు రూపంలో 99 రూపాయలు అదనంగా చెల్లించాలి. మళ్లీ, ఈ 99 రూపాయల మీద 18 శాతం GSTని కూడా కట్టాలి. 


ICICI బ్యాంక్ కూడా ఛార్జీల మోత మోగిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లిస్తున్న వాళ్ల నుంచి 1% ప్రాసెసింగ్‌ ఫీజు, దీని మీద GST వసూలు చేస్తోంది. అక్టోబర్ 20, 2022 నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది.