2000 Rupee Notes: మీ దగ్గర ఇంకా రూ. 2000 నోట్లు మిగిలి ఉంటే, వాటిని బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసులో డిపాజిట్ చేయడానికి ఈ రోజే (అక్టోబర్ 7, 2023) లాస్ట్ డేట్. అయితే, రేపటి నుంచి కూడా ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆ ఆప్షన్ గురించి చెప్పారు.
శుక్రవారం, రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్, ఇంకా 12,000 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తిరిగి రాలేదని చెప్పారు. అంటే రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లలో దాదాపు 97 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి. రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి.
రూ.2000 నోట్లను అక్టోబర్ 7 తర్వాత కూడా మార్చుకోవచ్చు
ఎవరి దగ్గరైనా రూ. 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోతే, అక్టోబర్ 7 తర్వాత కూడా వాటిని డిపాజిట్ చేయడం లేదా ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటే, అందుకు కొన్ని ఆప్షన్లను శక్తికాంత దాస్ చెప్పారు. 8 అక్టోబర్ 2023 నుంచి రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం వీలవుతుంది. అయితే బ్యాంక్ బ్రాంచ్‌ల్లో వాటిని తీసుకోరు. రిజర్వ్ బ్యాంక్ రీజినల్ ఆఫీసుల్లో మాత్రమే పెద్ద నోట్లను తీసుకుంటారు. ఆర్‌బీఐకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో పింక్ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి.
మొదటి పద్ధతి - సామాన్య ప్రజలు, సంస్థలు RBI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. మార్పిడి కోసం 20,000 రూపాయల పరిమితి ఉంది. అంటే, సాధారణ ప్రజలు లేదా సంస్థలు RBI ప్రాంతీయ కార్యాలయంలో ఒకేసారి 10 రెండు వేల రూపాయల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. భారతదేశంలో మీకు ఉన్న బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బును డిపాజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి పరిమితి లేదు.
రెండో పద్ధతి - రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ లేదా ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి పంపవచ్చు. ఆ మొత్తాన్ని భారతదేశంలోని వారి బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేస్తారు.
కోర్టులు లేదా చట్టపరమైన సంస్థలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, దర్యాప్తులో పాల్గొనే సంస్థలు లేదా అమలులో పాలుపంచుకున్న పబ్లిక్ అథారిటీలు కూడా రూ. 2000 నోట్లను దేశంలో ఉన్న RBI ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు. నోట్లు డిపాజిట్ చేయడానికి ఆయా సంస్థలకు కూడా పరిమితి లేదు.
గుర్తింపు కార్డు తప్పనిసరి
RBI నిబంధనల ప్రకారం, 2000 రూపాయల నోట్లతో పాటు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును సమర్పించాలి. గుర్తింపు కార్డు లేకుండా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకోరు.
మరో ఆసక్తికర కథనం: షేర్ల బైబ్యాక్‌పై కీలక అప్‌డేట్, వచ్చే బుధవారమే కంపెనీ డైరెక్టర్ల మీటింగ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial