Luxury Housing Sales: మన దేశంలో గృహ రుణాల మీద వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సొంత ఇళ్లకు, ముఖ్యంగా ఖరీదైన ఇళ్లకు డిమాండ్ (Housing Demand) ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో (మార్చి త్రైమాసికం), లగ్జరీ హౌసింగ్ సేల్స్ 151 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రకారం, మెరుగైన సౌకర్యాలతో కూడిన పెద్ద అపార్ట్‌మెంట్‌లకు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో (luxury housing sales in top cities) భారీ డిమాండ్ ఉంది.
ఇండియా మార్కెట్ మానిటర్ నివేదిక ప్రకారం, 2022 మార్చి త్రైమాసికంతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. ఈ కాలంలో, దిల్లీ NCRలో 1900 లగ్జరీ గృహాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయించిన 600 లగ్జరీ యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు మూడింతలకు పైగా పెరిగాయి.
చేతులు మారిన 4,400 యూనిట్లు
నివేదిక ప్రకారం... దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ముంబై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాలో కూడా లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో, ఖరీదైన రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాలు రెండున్నర రెట్లు పెరిగి 4,400 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో, ఈ టాప్-7 సిటీస్‌లో 1,600 ఖరీదైన రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడుపోయాయి.
2022 మార్చి త్రైమాసికంతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో... ముంబైలో అత్యాధునిక అపార్ట్‌మెంట్ల విక్రయాలు 800 యూనిట్ల నుంచి 1,150 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో 50 నుంచి 250కు చేరాయి, పుణెలో 10 నుంచి 150కి పెరిగాయి. బెంగళూరులో 50 విలాసవంతమైన గృహాలు అమ్ముడయ్యాయి, పెద్దగా మారలేదు.
హైదరాబాద్‌లో మహా జోరు
విలాసవంతమైన ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్‌లో మహా జోరు కనిపించింది. 2022 మార్చి త్రైమాసికంతో భాగ్యనగరంలో 50 లగ్జరీ గృహాలు అమ్ముడైతే, 2023 మార్చి త్రైమాసికంలో ఆ సంఖ్య 430కు చేరింది, దాదాపు 9 రెట్ల మేర పెరిగింది.
లగ్జరీ ఇళ్లతో పాటు మొత్తం అన్ని విభాగాలను లెక్కలోకి తీసుకుంటే... 2023 జనవరి-మార్చి 3 నెలల కాలంలో దేశంలో టాప్-7 నగరాల్లో మొత్తం 78,700 ఇళ్లు చేతులు మారాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో 70,500 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కరోనా అనంతరం, 2022లోనూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జోరుగా సాగాయి. అదే ట్రెండ్ 2023లోనూ కంటిన్యూ అయింది. మరికొన్ని త్రైమాసికాల పాటు ఇదే ధోరణి కొనసాగొచ్చని CBRE చైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అన్షుమాన్ మ్యాగజైన్ అంచనా వేశారు. ఆధునిక సదుపాయాలు ఉన్న లేదా విలాసవంతమైన గృహాలపై ఇప్పుడు ప్రజలు మక్కువ చూపుతున్నారని చెప్పారు.
కొత్త ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే, ముంబైలో 25,200 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. పుణెలో మొత్తం 16,000 హౌసింగ్ యూనిట్లు ప్రారంభం కాగా, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 11,200 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి.