RERA Rules for Delayed Possession: ఇల్లు కొనడం అనేది చాలా మందికి జీవితంలో ముఖ్యమైన విషయం. అతిపెద్ద ఖర్చుతో కూడుకున్న విషయాల్లో ఇది ఒకటి. అయితే బిల్డర్ అనుకున్న సమయానికి ఫ్లాట్ ఇవ్వనప్పుడు, కొనుగోలుదారుల కష్టాలు రెట్టింపవుతాయి. ఒకవైపు హోమ్ లోన్ ఈఎంఐ (EMI) చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు అద్దె ఖర్చులు కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితిలో బిల్డర్ తన మాట నెరవేర్చకపోతే కొనుగోలుదారుడు ఏం చేయవచ్చు తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఇవే ఇబ్బందులు
రియల్ ఎస్టేట్ రంగంలో ఆలస్యం కావడం అనేది కొత్త సమస్య కాదు. నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది లేదా నిర్ణీత సమయం కంటే చాలా ఏళ్లు వెనుకబడి పనులు నడుస్తుంటాయి. అనేక ప్రాజెక్టులలో కొనుగోలుదారులు 3 నుండి 4 సంవత్సరాల వరకు అదనంగా వేచి ఉండాల్సి వస్తుంది. దీనివల్ల వారి ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయి.
రెరా (RERA) ఇచ్చే రెండు పెద్ద హక్కులు
బిల్డర్ నిర్ణీత సమయానికి ఫ్లాట్ కొనుగోలుదారులకు ఇవ్వకపోతే, వారికి రెండు ప్రధాన ఆప్షన్లు ఉంటాయి. మొదటిది.. అతను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని, తాను కట్టిన పూర్తి మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరవచ్చు. రెండవది, అతను అదే ప్రాజెక్ట్‌లో కొనసాగుతూ, ఆలస్యమైన కాలానికి వడ్డీని లేదా పరిహారాన్ని డిమాండ్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్, అంటే రెరా (RERA) కొనుగోలుదారులకు చట్టపరమైన హక్కులను కల్పించింది.
Also Read: Retirement Plan: రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
రెరాలో ఎప్పుడు ఫిర్యాదు చేయాలి?
బిల్డర్లు పదేపదే పొడిగించే గడువుల కోసం కొనుగోలుదారులు వేచి చూడకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిర్ణీత తేదీ దాటిపోయి, బిల్డర్ ఎటువంటి నమ్మకమైన కాలపరిమితిని చెప్పనట్లయితే, రెరాలో ఫిర్యాదు చేయవచ్చు. అనేక కేసులలో రెరా కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, వడ్డీని లేదా రిఫండ్‌ను చెల్లించాలని బిల్డర్లను ఆదేశించడం తెలిసిందే.
ఈఎంఐ చెల్లించడం ఆపేయవచ్చా?
లేదు. బిల్డర్ మరియు బ్యాంక్‌తో జరిగే ఒప్పందాలు వేర్వేరుగా ఉంటాయి. బిల్డర్ ఫ్లాట్ ఇవ్వకపోయినప్పటికీ, బ్యాంక్‌కు ఈఎంఐని సమయానికి చెల్లించాల్సిందే. ఈఎంఐని నిలిపివేస్తే పెనాల్టీలు పడటం, క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం మరియు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
అద్దె, ఈఎంఐ రెండింటి భారం
ఫ్లాట్ చేతికి రావడం ఆలస్యం కావడం వల్ల అతిపెద్ద సమస్య ఒకేసారి అద్దె, ఈఎంఐ రెండింటినీ చెల్లిస్తున్న కుటుంబాలపై పడుతుంది. దీనివల్ల నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. పొదుపు తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఖర్చులకు నగదు సరిపోదు. కొన్ని సందర్భాల్లో టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రభావితం కావచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది.
ఏ ఏ పత్రాలను మీ వద్ద ఉంచుకోవాలి
కొనుగోలుదారులు కొన్ని ముఖ్యమైన పత్రాలు మీ వద్ద ఉంచుకుంటే ప్రయోజనం ఉటుంది. అలాట్‌మెంట్ లెటర్, పేమెంట్ రసీదులు, సేల్ అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, హోమ్ లోన్ రికార్డులు, రెరా రిజిస్ట్రేషన్ వివరాలు, బిల్డర్‌తో జరిపిన ఈమెయిల్ లేదా వాట్సాప్ సంభాషణలను సైతం సేవ్ చేసుకోవడం మంచిది. ఫిర్యాదు లేదా చట్టపరమైన చర్యల సమయంలో ఈ పత్రాలే మీకు బలమైన ఆధారాలుగా మారుతాయి.
