Hindenburg Research New Report: అదానీ గ్రూప్‌పై ‍(Adani Group)‌ నివేదికతో కొంప ముంచిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ మరో బాంబు పేల్చింది. మరో కంపెనీ తాట తీయడానికి సిద్ధంగా ఉన్నామని, కొత్త నివేదికను తీసుకు వస్తున్నామంటూ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ అమెరికన్‌ షార్ట్ సెల్లింగ్ సంస్థ త్వరలోనే మార్కెట్‌లో హీట్‌ పెంచే పని పెట్టుకుందని, మరో పెద్ద బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌ను బయటపెడుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 


2023 జనవరి 24న అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఒక నివేదికను సమర్పించింది, అదానీ గ్రూప్‌ మీద చాలా ఆరోపణలు చేసింది. ఆ నివేదిక తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ 120 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ గ్రూప్‌లోని లిస్టెడ్‌ షేర్లు దాదాపు 80 శాతం వరకు పతనమయ్యాయి. గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద సైతం రికార్డ్‌ స్థాయిలో క్షీణించింది, దాదాపు 150 బిలియన్‌ డాలర్ల నుంచి 53 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ, ఆ దెబ్బకు 35వ స్థానానికి దిగి వచ్చారు.


హిండెన్‌బర్గ్ కొత్త సిగ్నల్‌ ఏంటి?
గౌతమ్ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీ స్థాయిలో దోచుకున్న తర్వాత, హిండెన్‌బర్గ్ ఇప్పుడు మరో బిగ్‌ న్యూస్‌తో రెడీ అయింది. సింపుల్‌గా ఒక్క లైన్‌ ట్వీట్‌తో మార్కెట్‌లో హీట్‌ పెంచింది. "త్వరలో కొత్త నివేదిక రాబోతోంది - అది చాలా పెద్దది" అని హిండెన్‌బర్గ్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్సుకతను రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్లలోని ఇన్వెస్టర్లంతా దాని గురించే ఆలోచించడం ప్రారంభించారు. ఏం జరుగుతుందోనని చర్చిస్తున్నారు. 






 


ఈసారి టార్గెట్‌ కూడా ఇండియన్‌ కంపెనీలేనా?
ఈసారికి భారతీయ కంపెనీలు బతికిపోయినట్లేనని, హిండెన్‌బర్గ్‌ దృష్టి ఇప్పుడు భారత్‌పై లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికన్ బ్యాంకులపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ఉండవచ్చని ఊహాగానాలు చేస్తున్నారు.


గతంలోనూ కొన్ని కంపెనీలను టార్గెట్‌ చేసిన హిండెన్‌బర్గ్
అదానీ గ్రూప్‌ పతనం వల్ల మనలో చాలామందికి హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ గురించి తెలిసింది. అయితే, దీని తొలి బాధితురాలు అదానీ గ్రూప్‌ మాత్రం కాదు, అంతకుముందే కొన్ని అమెరికన్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదికలు వెలువడ్డాయి.  ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ నికోలా కార్ప్‌పై 2020 సెప్టెంబర్‌లో నివేదికను బయట పెట్టింది. ఆ తర్వాత ఆ కంపెనీ స్టాక్‌ భారీ నష్టాలను చవిచూసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.