HDFC Bank Q4 results: 2023 మార్చి త్రైమాసికం ఫలితాలను HDFC బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ నికర లాభం సంవత్సరానికి (YoY) దాదాపు 20% పెరిగి రూ. 12,047 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం 31% పెరిగి రూ. 53,851 కోట్లకు చేరుకుంది.
ఏడు బ్రోకరేజీల అంచనాల సగటు ప్రకారం, బ్యాంక్ నికర లాభం 21% పెరిగి రూ. 12,180 కోట్లకు చేరుతుందని మార్కెట్ లెక్కగట్టింది. ఈ అంచనాలకు అనుగుణంగానే HDFC బ్యాంక్ Q4 రిజల్ట్స్ ఉన్నాయి.
నికర వడ్డీ ఆదాయం
జనవరి-మార్చి కాలంలో నికర వడ్డీ ఆదాయం (NII) ఏడాదికి (YoY) 24% పెరిగి రూ. 23,352 కోట్లకు చేరుకుంది. కీలక నికర వడ్డీ మార్జిన్ మొత్తం ఆస్తులపై 4.1%గా, వడ్డీని ఆర్జించే ఆస్తులపై 4.3%గా లెక్క తేలింది.
ఇతర ఆదాయాలు ఏడాదికి 27% పెరిగి రూ. 8,731 కోట్లకు చేరుకున్నాయి, ఈ త్రైమాసికంలో కూడా బ్యాంక్ లాభానికి సాయపడ్డాయి.
డివిడెండ్
HDFC బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్, ఒక్కో షేరుకు 19 రూపాయల తుది డివిడెండ్‌ను ఆమోదించింది.
మార్చి త్రైమాసికంలో ప్రి-ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ (PPoP) 14.4% YoY పెరిగి రూ. 18,621 కోట్లకు చేరుకుంది. కేటాయింపులు, ఆకస్మిక అవసరాల నిధి రూ. 2,685.4 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 3,312.4 కోట్ల నుంచి తగ్గింది. ఇది, మంచి పరిణామం.
తగ్గిన రుణ ఖర్చులు
మొత్తం క్రెడిట్ ఖర్చు నిష్పత్తి 0.67%గా నమోదైంది, ఏడాది క్రితం 0.96%గా ఉంది. తగ్గిన రుణ ఖర్చులకు ఇది సూచన, ఇది మరొక ప్లస్ పాయింట్.
ఈ ప్రైవేట్ బ్యాంక్ ఆస్తి నాణ్యత దాదాపుగా స్థిరంగా ఉంది. మార్చి చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తుల (GNPAs) నిష్పత్తి 1.12%గా ఉంది. త్రైమాసికం క్రితం 1.23%గా, ఏడాది క్రితం 1.17%గా ఉంది.
మార్చి చివరి నాటికి నికర నిరర్థక ఆస్తుల (NNPAs) నిష్పత్తి 0.27%గా ఉంది, త్రైమాసికం క్రితం 0.33%, ఏడాది క్రితం 0.32%గా నమోదైంది.
మూలధన సమృద్ధి నిష్పత్తి (capital adequacy ratio) గణనీయంగా మెరుగుపడింది. ఒక సంవత్సరం క్రితం ఉన్న 18.90%, త్రైమాసికం క్రితం ఉన్న 17.66%తో పోలిస్తే.. మార్చి 31 నాటికి 19.26%కి చేరింది.
డిపాజిట్లలో ఆరోగ్యకర వృద్ధి
HDFC బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 21% ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించాయి, మార్చి 31 నాటికి రూ. 18.83 లక్షల కోట్లుగా ఉన్నాయి. CASA డిపాజిట్లు 11.3% పెరిగాయి. వీటిలో.. సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల విలువ రూ. 5.62 లక్షల కోట్లు, కరెంట్ ఖాతా డిపాజిట్ల విలువ రూ. 2.73 లక్షల కోట్లు.
మొత్తం అడ్వాన్స్‌లు మార్చి 31 నాటికి 17% పెరిగి రూ. 16 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ రిటైల్ లోన్లు 21%, వాణిజ్య & గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 30%, కార్పొరేట్, ఇతర హోల్‌సేల్ రుణాలు 12.6% పెరిగాయి. మొత్తం అడ్వాన్సుల్లో ఓవర్సీస్ అడ్వాన్సులు 2.6%గా లెక్క తేలాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.