HDFC Bank Results: త్రైమాసిక ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదరగొట్టింది. వార్షిక ప్రాతిపదికన 22.8 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి క్వార్టర్లో రూ.10,055 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.8,186 కోట్లు కావడం గమనార్హం. ప్రావిజన్స్ దాదాపుగా రూ.1300 కోట్లకు తగ్గడమే ఇందుకు కారణం.
2020-21 ఏడాది జనవరి-మార్చిలోని రూ.4693 కోట్లతో పోలిస్తే గతేడాది నాలుగో క్వార్టర్లో ప్రావిజన్స్ రూ.3312 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా రుణ నష్టాల ప్రావిజన్స్ రూ.1778 కోట్లు, సాధారణ ఇతర ప్రావిజన్స్ రూ.1534 కోట్లుగా ఉంది. 'ప్రస్తుత క్వార్టర్‌లో కంటిజెన్స్‌తో సహా మొత్తం ప్రావిజన్స్ రూ.1000 కోట్లు కలిసే ఉన్నాయి' అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
కంపెనీ క్రెడిట్ కాస్ట్ రేషియో 0.96 శాతంగా ఉంది. 2021, డిసెంబర్ 31 ముగిసిన త్రైమాసికంలో ఇది 0.94 శాతంగా ఉండేది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1.64 శాతంగా ఉండేది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కం) 10.2 శాతం పెరిగి రూ.18,872 కోట్లుగా ఉంది. అడ్వానెన్స్ గ్రోత్ 20.8 శాతం ఉండటమే ఇందుకు కారణం. వివిధ ప్రొడక్టులు, సెగ్మెంట్లలో రుణాల వృద్ధి పెరిగిందని కంపెనీ తెలిసింది. రిటైల్ అడ్వాన్సులు 15.2 శాతం, కమర్షియల్, రూరల్ బ్యాంకింగ్ రుణాల్లో 30.4 శాతం, హోల్‌సేల్ లోన్స్ గ్రోత్ 17,4 శాతంగా ఉంది.
బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 39 శాతంగా ఉన్నాయి. గతేడాది 47 శాతంతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఇక పర్సనల్ లోన్లు 10 శాతంగా ఉన్నాయి. మొత్తం ఆస్తులతో పోలిస్తే కోర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం రూ.7,637 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. వడ్డీయేతర ఆదాయం 10.6 శాతంగా ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఇన్వెస్ట్‌మెంట్లను విక్రయించడం ద్వారా రూ.40.3 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. ఇక డిపాజిట్ల గ్రోత్ 16.8 శాతం పెరిగి రూ.15.59 ట్రిలియన్లుగా ఉంది. కరెంట్, సేవింగ్స్ అకౌంట్ (కాసా) గ్రోత్ 22 శాతంగా ఉంది. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 48 శాతంగా ఉంది. 2021, మార్చిలోని 46 శాతంతో పోలిస్తే పెరిగింది.